Jul 21,2021 21:01

వాషింగ్టన్‌ : భారతదేశంలో వాస్తవంగా కోవిడ్‌ మరణాల సంఖ్య 30 నుండి 50లక్షల మధ్య వుంటుందని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ నిర్వహించిన కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక గణాంకాలకు కనీసం పది రెట్లు అసలు మరణాలు వుంటాయని తెలిపింది. వందల వేల సంఖ్యలో కాదు, కొన్ని లక్షల మరకు మరణాల సంఖ్య వుండవచ్చని ఆ నివేదిక తెలిపింది. స్వాతంత్య్రం, దేశ విభజన తర్వాత జరిగిన అతి పెద్ద మానవ విషాదమిదేనని వ్యాఖ్యానించింది. మొత్తంగా మానవాళిపై జరిగిన అతిపెద్ద నేరం ఇదేనని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో కేసులు, మరణాల గురించి ఎలా తక్కువగా చూపిస్తున్నారో ఇతర దేశాల్లో కూడా ఇదే జరిగిందని, అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపింది. అంటే వాస్తవానికి కరోనా మహమ్మారి కాటుకు బలైన వారి సంఖ్య చాలా చాలా ఎక్కువగానే వుందని చెప్పవచ్చని పేర్కొంది. అధికారిక గణాంకాల ప్రకారం 40.13లక్షలని పేర్కొంటున్నారు కానీ వాస్తవానికి కోటి పై మాటే వుండవచ్చని ఆ నివేదిక తెలిపింది. మంగళవారం ఈ అధ్యయనం వివరాలు వెల్లడించారు. భారత్‌లో 2020 ఏప్రిల్‌ నుండి 2021 మార్చి వరకు ఫస్ట్‌ వేవ్‌లో 15 లక్షల నుండి 34లక్షల వరకు అధికంగా మరణాలు సంభవించి వుంటాయని అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు సెకండ్‌ వేవ్‌లో ప్రతి రోజూ నమోదైన మరణాలు కూడా అంతకంటే ఎక్కువే వుండవచ్చని తెలిపింది. ఈ మూడు నెలల్లోనే 14లక్షల నుండి 24లక్షల మంది మరణించి వుంటారని అంచనా. ఫస్ట్‌ వేవ్‌ కన్నా మూడు రెట్లు ఎక్కువగా మరణాలు సంభవించాయి. కరోనాపై పోరాడేందుకు అవసరమైన మౌలిక, అవసరమైన పరికరాలు సమయానికి అందుబాటులో లేకుండా పోయాయని పేర్కొంది. ఆక్సిజన్‌, రెమెడెసివర్‌ వంటి సరఫరాలను అవసరమున్న కుటుంబాలు బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని నివేదిక తెలిపింది. భారత్‌లోని లక్షలాదిమంది పోషకాహార లోపంతో బాధపడే వారు ఎదుర్కొంటున్న సామాజిక పరిస్థితులు మరణాల సంఖ్య పెరిగేందుకు దోహదపడిందని పేర్కొంది. పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడం, సరైన ఆహారం అందకపోవడం, పైగా భౌతిక దూరాలు పాటించే పరిస్థితి లేకపోవడం వంటివి వున్నపుడు మొదటి వేవ్‌లో పరిస్థితి చూసి తర్వాతైనా ప్రభుత్వం జాగ్రత్త పడి వుండాల్సిందని నివేదిక పేర్కొంది. ఈ విపత్తుకు మోడీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆర్థిక సంపన్నదారుల హక్కులను, సంపదను కాపాడే ఏకైక లక్ష్యంతోనే ప్రతి దశలోనూ వ్యవహరించిందని పేర్కొంది. అర్ధంతరంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపివ్వడం మినహా కోవిడ్‌ మహమ్మారిని అడ్డుకోవడానికి చేసిందేమీ లేదని విమర్శించింది. తర్వాత వైరస్‌ అదుపులోకి రావడానికి ముందుగానే లాక్‌డౌన్‌ను ఎత్తివేసిందని పేర్కొంది. అసంఘటిత కార్మికులకు ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు, దీంతో వేలాదిమంది గ్రామీణ ప్రాంతాల్లోని తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. దీంతో వైరస్‌ దేశవ్యాప్తంగా విస్తరించడానికి కారణమైంది.