May 17,2022 15:28

న్యూఢిల్లీ :  విజయం సాధించిన క్రీడాకారుల బృందాన్ని ఆదేశ ప్రధాని అభినందించడం ఎక్కడ చూడలేదని భారత షట్లర్‌ చిరాగ్‌ శెట్టీ పేర్కొన్నారు. ఇది కేవలం భారత్‌లోనే సాధ్యమని అన్నారు. మరో విజయాన్ని సాధించేందుకు ఈ ప్రశంసలు మాకు ఉత్తేజాన్ని కలిగించాయని అన్నారు. ప్రధాని బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ తమ కోసం సమయం కేటాయించడం, తాము సాధించిన విజయానికి ప్రత్యేకంగా అభినందనలు తెలపడం అందరికీ సంతోషాన్ని కలిగించాయని అన్నారు. థామస్‌ కప్‌ ఫైనల్‌లో ఇండోనేషియాను 3-0తో ఓడించడం అద్భుతంగా అనిపిస్తుందని అన్నారు. చారిత్రాత్మక థామస్‌ కప్‌ విజయం సాధించిన భారత క్రీడాకారుల బృందాన్ని ప్రధాని మోడీ అభినందించిన సంగతి తెలిసిందే. 1949లో ప్రారంభమైన థామస్‌ కప్‌ కిరీటాన్ని ఈ ఏడాదికి గాను గెలుచుకోవడం ద్వారా భారత జట్టు చరిత్ర సృష్టించింది.