May 13,2022 13:14

కొలంబొ :  భారత్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూస్తున్నానని శ్రీలంక కొత్త ప్రధాని రణిల్‌ విక్రమ్‌ సింఘే పేర్కొన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఇటీవల శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తమ దేశానికి ఆర్థిక సహాయం అందించినందుకు భారత ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేలా, రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికేలా దేశ నూతన ప్రధానమంత్రిగా రణిల్‌ విక్రమ్‌ సింఘే గురువారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం రాత్రి ఒక మతపరమైన వేడుకలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌ అందించిన సహాయాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నానని, అలాగే మోడీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకకు వివిధ రూపాల్లో భారత్‌ 3 బిలియన్ల డాలర్లను అందించేందుకు ముందుకు వచ్చింది.
అయితే 225 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో ఒకేఒక్క సీటు ఉన్న మీరు ప్రధాని పదవిని కొనసాగించగలననుకుంటున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ... అవసరం వచ్చినపుడు తన మెజారిటీని నిరూపించుకుంటానని అన్నారు. దేశవ్యాప్త నిరసనలపై మాట్లాడుతూ.. నిరసనకారులతో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా పాలనను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నూతన ప్రధానితో కలిసి పనిచేసేందుకు భారత్‌ ఎదురుచూస్తోందని కొలంబలోని భారత హైకమిషన్‌ కూడా ప్రకటించింది.