May 17,2022 22:46

హ్యాపీ చిల్డ్రన్‌హోంలో ఉన్న చిన్నారులు

ప్రజాశక్తి పుట్టపర్తి రూరల్‌ : భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలు ముక్కుపచ్చలారని ముగ్గురు పిల్లల పాటిట శాపంగా మారాయి. భార్యతో ఏర్పడిన మనస్పర్థలు, ఇబ్బందులను స్పందనలో విన్నవించుకోవడానికి ముగ్గరు పిల్లలతో కలసి వచ్చిన వ్యక్తి తమ పిల్లలను పుట్టపర్తి విమానశ్రయం వద్ద వదిలి వెళ్లాడు. ఈ ఘటనకు సంబందించి ఐసిడిఎస్‌ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాలు.... హిందూపురం మండలం మలుగూరు గ్రామానికి చెందిన శీనప్పకు ముగ్గురు పిల్లలు. ఆరు సంవత్సరాల కూతురు ఆరాధ్య, మూడు సంవత్సరాల కుమారుడు ప్రత్యూషసాయి, 18 నెలల కుమారుడు నితిన్‌ ఉన్నారు. శీనప్ప భార్య లావణ్య కొంతకాలం క్రితం భర్తను, తన ముగ్గురు బిడ్డలను వదిలి వెళ్లిపోయింది. దీంతో ఆ ముగ్గురు పిల్లలు తండ్రి సంరక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శీనప్ప తన ముగ్గురు పిల్లలతో కలసి సోమవారం రాత్రి పుట్టపర్తికి వచ్చాడు. మంగళవారం ఉదయం పుట్టపర్తి విమానాశ్రయం వద్ద పిల్లలను వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆ పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ కూర్చొన్నారు. అది గమనించిన స్థానికులు అధికారులను సమాచారమిచ్చారు. స్పందించిన ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ అరుణకుమారి పుట్టపర్తి అర్బన్‌ పోలీసుల సహకారంతో పిల్లలను పుట్టపర్తిలోని హ్యాపీ చిల్డ్రన్‌ హోంకు తరలించారు. అక్కడ పిల్లలతో వివరాలను సేకరించారు. తమ తల్లి గత కొంత కాలం నుండి గ్రామంలో లేదని దాంతో తండ్రి సంరక్షణ లో ఉన్నామని వారు చెప్పారు. ముగ్గురు పిల్లలను గురువారం అనంతపురం సిడబ్ల్యుసికి తరలించ నున్నట్లు అధికారులు తెలిపారు. హిందూపురం పోలీసుల సహకారంతో మలుగూరులో ఉన్న శీనప్ప వివరాలను తెలుసుకుంటామని చెప్పారు.
పుట్టపర్తి అర్బన్‌ : భార్య భర్తల మధ్య గొడవలు వివాదాలు చిన్నారులకు శాపంలా మారాయి. పట్టణ సీఐ బాలసుబ్రమణ్యం రెడ్డి తెలిపిన వివరాలు... హిందూపురానికి చెందిన ఆటోడ్రైవర్‌ శ్రీనివాసులు, ఆయన భార్య లావణ్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్పీ కార్యాలయానికి స్పందన కార్యక్రమానికి శ్రీనివాసులు తనకు గల ముగ్గురు పిల్లలను ఆరాధ్య (6) ప్రత్యూ సాయి (4) నవీన్‌ (2) తీసుకొని పుట్టపర్తికి వచ్చాడు. అనంతరం స్పందనలో అధికారులను వినతిపత్రం ఇచ్చిన ఆయన పిల్లలను విమానాశ్రయం సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. పట్టణ పోలీసులు పిల్లలను స్టేషన్‌ కు తీసుకెళ్లారు. పిల్లలతో వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించారు. మంగళవారం సాయంత్రం ఆ పిల్లలను పుట్టపర్తిలో ఐసిడిఎస్‌ అధికారులకు అప్పగించారు. భార్య భర్తల మధ్య గొడవలే కారణమని ప్రాథమికంగా తెలిసిందని దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.