Feb 23,2021 08:12

జగిత్యాల : భార్యపై అనుమానం పెంచుకున్నాడు.. పలుమార్లూ ఆమెతో గొడవ పడ్డాడు.. చివరికి గొడ్డలితో ఆమె తల, మెడ చేతులపై విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు.. ఆపై తెల్లవారే వరకు భార్య మృతదేహం వద్దే కుర్చున్నాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెల్గటూరు మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య (45), సుజాత (37) దంపతులకు ఇద్దరు మగపిల్లలు. వీరి కుటుంబం చర్లపల్లిలోనే ఉంటుంది. కానీ, శంకరయ్య ఉపాధి నిమిత్తం ముంబయికి వెళ్లి అక్కడే ఓ కల్లు దుకాణంలో పని చేస్తున్నాడు. వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు. అయితే, కొంత కాలంగా శంకరయ్య భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇంటికొచ్చిన ప్రతిసారీ మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడు. కాగా, ఇటీవల మల్లన్న స్వామి పట్నాల మొక్కులు తీర్చుకోవడం కోసం 2 నెలల క్రితం ఇంటికి వచ్చిన శంకరయ్య అప్పటి నుంచి స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ప్రతిరోజూ మద్యం చేవిస్తూ భార్యతో గొడవపడేవాడు. రోజులాగే ఆదివారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చిన శంకరయ్య భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్‌రూమ్‌కు వెళ్లిన భార్య తిరిగి బాత్‌రూమ్‌లో నుంచి బయటికి రాగానే అక్కడే కాపుకాచిన శంకరయ్య తనతో తెచ్చుకున్న గొడ్డలితో నరికాడు. ఆమె తల, మెడ, చేతులపై విచక్షణారహితంగా నరకడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం తెల్లవారే వరకూ ఆమె మృతదేహం వద్దే కూర్చున్నాడు. పిల్లలు నిద్ర లేచి తల్లి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. ఈ విషయం మృతురాలి కుటుంబసభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహం వద్దే కూర్చున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.