
- జమ్మూ కాశ్మీర్లో వెల్లువెత్తుతున్న నిరసనలు
- శ్రీనగర్లో ప్రదర్శకులపై లాఠీచార్జి
శ్రీనగర్ : కాశ్మీరీ పండిట్ హత్యకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమ భద్రతకు భరోసా ఏదీ అని నిరసనకారులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. శ్రీనగర్ విమానాశ్రయం దిశగా వెళ్ళేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. లాఠీచార్జీ కూడా చేశారు. చాలాచోట్ల కాశ్మీరీ పండిట్లు తాత్కాలిక శిబిరాల నుండి బయటకు వచ్చి రోడ్లను దిగ్భంధించారు. బిజెపి ప్రభుత్వానికి, మోడీ, అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాలుగు వేల మందికి పైగా కాశ్మీరీ పండిట్లు తాత్కాలికంగా శిబిరాల్లో ఉంటున్నారు. పలు చోట్ల కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. ''ఈ సిగ్గుచేటైన సంఘటనను మేం ఖండిస్తున్నాం. ఇదేనా పునరావాసమంటే ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మమ్మల్ని చంపడానికే ఇక్కడకు తీసుకువచ్చారా? ఇక్కడ భద్రత ఏది?'' అని ఆందోళనలకు దిగిన రంజన్ జుత్షి ప్రశ్నించారు. ''మేం పని చేసుకోవడానికే వచ్చాం. అంతకుమించి మాకు ఇక్కడ వేరే పని లేదు. మమ్మల్ని ఎందుకు కాల్చి చంపుతున్నారు.? మా నేరమేంటో చెప్పండి'' అని మరో నిరసనకారుడు ప్రశ్నించారు. అధికారులు ఎన్ని హామీలు ఇచ్చినా, మాపై దాడులు కొనసాగుతునే వున్నాయని సంజరు అనే వ్యక్తి వాపోయారు. ఇక్కడ పరిస్థితి ఎంత దుర్భరంగా వుందోచూడండి, తహసిల్దారు కార్యాలయంలో భద్రత వుంటుందని ఆశిస్తాం. కానీ తన టేబుల్ దగ్గర కూర్చుని పని చేసుకుంటున్న రాహుల్ భట్ శరీరంలోకి తూటాలు అతి సమీపం నుండి దిగబడ్డాయని చెప్పారు. బుద్గామ్లోని షేక్పొరా వద్ద జరుగుతున్న ఆందోళనల్లో స్థానిక ముస్లింలు కూడా చేతులు కలిపారు. ఆందోళనకారులకు మంచినీరు అందచేశారు. కాశ్మీరీ పండిట్లకు భద్రత, న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. మేజిస్ట్రేట్ కార్యాలయంలోనే హత్య జరిగితే కాశ్మీరీ పండిట్లకు ఇక భద్రత ఎక్కడుంటుందని జావేద్ ఇక్బాల్ ప్రశ్నించారు. తాను బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వీల్లేకుండా తనను గృహ నిర్బంధంలో వుంచారని పిడిపి అధ్యక్షుడు మెహబూబా ముఫ్తి వ్యాఖ్యానించారు. ఆందోళనకారులను ఉక్కుపాదంతో అణచివేయడానికి చర్యలు తీసుకోవడం సిగ్గుచేటని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.