Sep 27,2022 17:15

చండీగఢ్‌  :   పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌పై పంజాబ్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్య మాటల యుద్ధానికి దారితీసిన సంగతి తెలిసిందే. మొదట సెప్టెంబర్‌ 22న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని భగవంత్‌ మాన్‌ గవర్నర్‌ను కోరారు. అయితే కేవలం విశ్వాస తీర్మానానికే పరిమితమై సభను ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ పురోహిత్‌ అనుమతి నిరాకరించారు. దీంతో వ్యర్థపదార్ధాలను తగులబెట్టడం, జిఎస్‌టి, విద్యుత్‌ సరఫరా అంశాలను కూడా అసెంబ్లీలో చేరుస్తున్నట్లు ప్రకటించడంతో సెప్టెంబర్‌ 27న అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్‌ అనుమతించారు.  అక్టోబర్‌ 3 వరకు సమావేశాలను పొడిగించారు.

ఈ విశ్వాస తీర్మానాన్ని రాష్ట్ర ప్రతిపక్ష నేత పర్తాప్‌ సింగ్‌ భజ్వా వ్యతిరేకించారు. గవర్నర్‌ అధికారాలను సవాలు చేసేందుకే ఆప్‌పార్టీ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఈ విశ్వాస తీర్మానాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. ట్రెజరీ బెంచ్‌ల ద్వారా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్‌, అకాలీదళ్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

కాగా, 117 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్‌కు 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి యత్నిస్తోందని మాన్‌ పేర్కొన్నారు. ఆపరేషన్‌ కమలం పేరుతో బిజెపియేతర ప్రభుత్వాలను కూల్చివేస్తుందని, ఎక్కడైనా తమ పార్టీయే ప్రభుత్వంలో ఉండాలని బిజెపి కోరుకుంటోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అసెంబ్లీ చట్టాల గురించి తమకు బోధిస్తోందని.. మొదట రాజస్థాన్‌లో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని ఎద్దేవా చేశారు.