Mar 02,2021 18:52

భీమా కుటుంబం గోవా మురికివాడ వాస్కోలో నివసించేది. తండ్రి మద్యానికి బానిస. తల్లి చెత్త ఏరుకుంటూ వచ్చిన జీతంతోనే ఐదుగురు కూతుళ్లను పోషించేది. భీమా చదువుకోలేదు. చెల్లెళ్లను చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. కుటుంబానికి ఏ ఆదాయం లేదు కదా, భీమాను దేవదాసీగా చేస్తే కొంత నిలదొక్కుకోవచ్చని ఇరుగుపొరుగువారు ఆమె తల్లిదండ్రులకు సూచించారు. అలా 15 సంవత్సరాల వయసులో భీమా బైనాలోని వ్యభిచార గృహంలో అడుగుపెట్టింది. రెండు, మూడుసార్లు అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. రెండేళ్ల పాటు అక్కడే ఉండిపోయింది భీమా.

2003లో అన్యారు రహిత్‌ జిందగీ (అర్జ్‌) అనే ఎన్‌జిఒ సంస్థతో కలిసి క్రైమ్‌ బ్రాంచ్‌ నిర్వహించిన దాడిలో భీమాతో పాటు కొంతమంది బాలికలు రక్షింపబడ్డారు. వారిని ప్రభుత్వ రక్షణ గృహానికి తీసుకొచ్చారు. అయితే చదువుకోకపోవడం వల్ల ఆమెకు అక్కడ ఏవిధమైన ఉపాధి మార్గాలు దొరకలేదు. దీంతో ఎన్‌జిఒ వర్కర్లు ఆమెను అర్జ్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ సంస్థ వీధిబాలలకు స్థానిక సంఘాల ద్వారా ట్యూషన్‌ చెప్తోంది. ఆ పిల్లలకు చేతివృత్తులు నేర్పడం ప్రారంభించింది భీమా. అలా కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

'నేను నా గతం నుండి తప్పించుకోగలిగాను. వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్న చిన్నారులను ఎవరు కాపాడుతారు?' అనే ఆలోచన భీమాను వెంటాడుతూనే ఉండేది. బలవంతంగా లైంగిక దాడికి గురవుతున్న యువతులను రక్షించడానికి, వారికి పునరావాసం కల్పించేందుకు సిద్ధమైంది. రక్షించబడిన కొంతమంది దేవాదాసీలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వ్యభిచార వృత్తిలో చిక్కుకునే అమ్మాయిలను గుర్తించే పని మొదలు పెట్టింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ దుర్భర పరిస్థితులు, పరిణామాలపై అవగాహన కల్పించింది. ఇప్పటివరకు 800 మంది బాలికలను లైంగిక వేధింపులకు గురికాకుండా కాపాడింది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇప్పుడు వారిలో చాలామంది వివిధ వృత్తులలో పనిచేస్తున్నారు.

యువతులను రక్షించే పనిలో భాగంగా ఒక్కోసారి తన దుర్భర జీవితానికి కారణమైన బైనాకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ ఆమెకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యేవి. అయినా అక్కడి నుంచి ఒక్క అమ్మాయినైనా రక్షించాలనుకున్న భీమా అవన్నీ తట్టుకుంది. 2004లో హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం భారీ సంఖ్యలో వ్యభిచార గృహాలను కూల్చివేసింది. అప్పుడే అక్కడున్న వారిలో ఎంతోమందిని చేరదీసి 'అర్జ్‌'కు తీసుకెళ్లింది. కొన్ని నెలల తర్వాత వారంతా లాండ్రీ సేవలను ప్రారంభించారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న యువతులను సమీకరించే పనిలో ఉంటూనే, లాండ్రీ సేవలందించే స్విఫ్ట్‌వాష్‌లో పర్యవేక్షకురాలిగా మారింది భీమా. ఈ వెంచర్‌ ద్వారా ఇప్పటివరకు సుమారు 500 మంది మహిళలు ఉపాధి పొందడానికి ఆమె సహాయపడింది. భీమా చేసిన సామాజిక కృషికి 2019లో సిఐఐ ఉమెన్‌ ఎక్స్‌ప్లార్‌ అవార్డు లభించింది.

ఒకప్పుడు అవమానాలు, అవహేళనలు తోడైన భీమా అంటే ఇప్పుడు అక్కడి మహిళలకు ఎంతో గౌరవం. 'భీమా దీదీ' అని పిలుస్తూ ప్రతి విషయంలో ఆమె సలహా తీసుకుంటారు. 'నేను చదువుకోలేదు. వాస్కో దాటి ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదు. కానీ నేను గౌరవించబడే దూరం ప్రయాణించాను. వ్యభిచారం తప్ప తమకు ఏ మార్గం లేదని భావించే ఇతర బాలికలకు ఇది ప్రేరణ కావాలి' అంటుంది భీమా.

'భీమా దీదీ'