Sep 15,2021 21:58
సభలో మాట్లాడుతున్న రాఘవులు

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి/కార్పొరేషన్‌ : దేశంలోని అన్ని వ్యవస్థలనూ బిజెపి ధ్వంసం చేస్తోందని, బిజెపితో తీవ్ర ప్రమాదం పొంచి ఉందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. బిజెపి ప్రజావ్యతిరేక విధానాలపై బుధవారం కర్నూలు లలిత కళా సమితిలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.గౌస్‌ దేశారు అధ్యక్షతన జరిగిన సభలో రాఘవులు ముఖ్యఅతిథిగా పాల్గన్నారు. దీనికి ముందు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల రాష్ట్రంలో వైసిపి, టిడిపి మౌనంగా ఉంటున్నాయని అన్నారు. రాష్ట్రానికి బిజెపి ద్రోహం చేస్తోన్నా, ఘోరంగా పాలన సాగిస్తోన్నా ప్రశ్నించడానికి ఆ పార్టీల వారికి నోరు రావడం లేదా? బిజెపి అంటే భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. దీనికి ఆ పార్టీ వారు సమాధానం చెప్పాలన్నారు. బిజెపి అమలు చేస్తోన్న విధానాలు, ప్రజా వ్యతిరేక, చట్టాల సవరణకు వ్యతిరేకంగా 27న భారత్‌ బంద్‌ జయప్రదానికి వామపక్షాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ బంద్‌కు వైసిపి, టిడిపి మద్దతు తెలిపే విషయం తేల్చుకోవాలని, బంద్‌కు మద్దతు ఇవ్వకపోతే ఆ పార్టీల వాళ్లను కూడా ప్రజలు దేశ ద్రోహులు అనుకుంటారని పేర్కొన్నారు. కరోనా కన్నా మోడీనే పెద్ద మహమ్మారి అని విమర్శించారు. బిజెపికి ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ప్రజలు బుద్ధి చెప్పారని, భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల ప్రజలూ బుద్ధి చెబుతారని అన్నారు. దేశంలో ఇప్పటి వరకూ 14 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ జరిగిందని తెలిపారు. కనీసం 60 శాతం మందికి రెండు డోసులు వేస్తేనే మూడో దశ రాకుండా నివారించగలమని అన్నారు. ఇప్పటికీ జిడిపి 9.2 శాతం లోటులో ఉందని, చైనాలో 11 శాతం వృద్ధిలో ఉందని తెలిపారు. బిజెపి ప్రభుత్వం వల్లే దేశంలో ఈ దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ అసమర్థత మూలంగా నిత్యావసరాల ధరలు పెరిగాయని, మరో పక్క రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని తెలిపారు. కరోనాతో ఆదాయం లేక అప్పుల పాలైన వారికి పెరిగిన ధరలు పెను భారంగా మారాయన్నారు. దేశంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం బిజెపి చేస్తోందని విమర్శించారు. ప్రశ్నించే, నిరసన తెలిపే వాళ్ల గొంతులు నొక్కడానికి దేశ ద్రోహం కేసులు పెడుతున్నారని, పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని రక్షించుకోవాలని, సంక్షోభం నుండి ప్రజలను కాపాడుకోవాలంటే బిజెపిని అధికారం నుంచి దింపవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ట్రూ అప్‌ ఛార్జీలు అన్యాయమని అనే హక్కు రాష్ట్రంలో బిజెపి నేతలకు లేదని, బిజెపి చేసిన సంస్కరణలతోనే రాష్ట్రాలు ప్రజలపై భారాలు వేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల తరుపున పోరాడుతున్న వామపక్షాలకే ప్రశ్నించే హక్కు ఉందన్నారు.

త్రిపుర సిపిఎంకు అండగా నిలవాలి
త్రిపురలో సిపిఎం కార్యాలయాన్ని బిజెపి వారు తగలబెట్టారని, కార్యకర్తలపై దాడి చేశారని రాఘవులు తెలిపారు. బాధితులకు అండగా విరాళాల సేకరణకు సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు ఇచ్చిందని, ఇతర వామపక్షాలు కూడా అందుకు కృషి చేస్తున్నాయని, ఆ కృషికి తోడ్పాటు అందించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల, సిపిఎం నగర కార్యదర్శులు రాముడు, రాజశేఖర్‌, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు నరసింహులు పాల్గొన్నారు.