Oct 03,2022 00:30

ఘటనా స్థలిలో రక్తపు మడుగులో విజయలకీë మృతదేహం

ప్రజాశక్తి - సత్తెనపల్లి : మహిళ అర్ధరాత్రి ఒంటరిగా సంచరించిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం అని చెప్పిన గాంధీ జయంతి రోజునే ఒంటరిగా ఉన్న మహిళ హత్యకు గురైంది. ఇంట్లో ఉన్న మహిళను భర్త, మామ కలిసి పట్టపగలే దాడి చేసి దారుణంగా హతమార్చారు. సత్తెనపల్లి పట్టణంలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక అచ్చంపేట రోడ్‌లో నివాసం ఉండే విజయలక్ష్మి (36), అదే ప్రాంతానికి చెందిన పసుపులేటి నాగరాజు 15 ఏళ్ల కిందట ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు పుట్టిన అనంతరం భార్యను నాగరాజు తరచూ అనుమానంతో వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో ఐదేళ్ల వీరి కుమారుడు గతంలోనే డెంగ్యూతో మృత్యు వాత పడ్డాడు. అనంతరమూ నాగరాజు వేధింపులు ఎక్కువవడంతో తట్టుకోలేని విజయలక్ష్మి తన భర్త నుండి వేరుపడింది. పుట్టింటికి వెళ్లాలన్నా వారు పేదలు కావడం, తన తోబుట్టువులు ఇద్దరూ సోదరిలే కావడంతో విజయలక్ష్మి తన 13 ఏళ్ల కుమార్తెను తీసుకుని మరో ఇంట్లో ఉంటూ టైలరింగ్‌ ద్వారా బిడ్డను పోషించుకుంటోంది. మూడేళ్లు ఇలా జీవించాక రెండేళ్ల కిందట విజయలక్ష్మితో నాగరాజు చర్చించి సఖ్యతగా ఉందామని నమ్మించాడు. దీంతో అప్పటి నుండి తన బిడ్డతో కలిసి విజయలక్ష్మి తన భర్త వద్దకు వెళ్లింది. నాలుగు నెలల నుండి మళ్లీ అనుమానపు వేధింపులు పెరగడంతో విజయలక్ష్మి వేరుబడి జీవిస్తోంది. విడాకులు కావాలని నోటీసులూ పంపింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం విజయలక్ష్మి తన కుమార్తె మీనాక్షిని సర్వస్వతి పూజ కోసమని సమీపంలోని రామాలయానికి పంపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయలక్ష్మిపై భర్త నాగరాజు, అతని తండ్రి పుల్లయ్య దాడి చేశారు. విజయలక్ష్మిపై తలపై ఆయుధంతో గట్టిగా కొట్టడంతో విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితులిద్దరూ పరారయ్యారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు సిఐ యు.శోభన్‌బాబు కేసు నమోదు చేశారు. ఇద్దేరే దాడి చేశారా? వారికి ఎవరైనా సహకరించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.