Nov 30,2022 23:51

aమాట్లాడుతున్న రాష్ట్ర నేత శేఖర్‌

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌:స్థానిక శ్రీ కృష్ణ ప్యాలెస్‌ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్‌ బాడీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు శివలంక కొండలరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో అనేక భూ సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించాలని డిమాండ్‌ చేశాఉరు. అటవీ హక్కుల చట్టం అమలు జరగలేదని, మైదాన ప్రాంత గిరిజనులకు న్యాయం చేయ లేదన్నారు. ప్రభుత్వాలు పేదలకు భూ పంపిణీ చేయలేదని, కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ పథకాన్ని నవరత్నాల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర సందర్భంలో పేదలందరికీ ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తాననని చెప్పి కేవలం 1,80,000 మాత్రమే ఇస్తే పేదలు ఇల్లు ఎలా కట్టుకోగలరని అని ప్రశ్నించారు. జగనన్న ఇళ్ల కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు, మౌలిక వసతులు కరువయ్యాయని దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో పేదలు ఎలా బతకాలని ప్రశ్నించారు.
సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ, రైతులకు మద్దతుగా పోరాటాలు చేయవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు, సంఘం జిల్లా బాధ్యులు మాకిరెడ్డి రాము నాయుడు, రైతు సంఘం అనకాపల్లి జిల్లా బాధ్యులు జి.గురు బాబు, కార్మిక సంఘం అనకాపల్లి జిల్లా సీనియర్‌ ఉపాధ్యక్షులు పి.తాతబ్బాయి పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం గౌరవాధ్యక్షులుగా పాలపర్తి తాతబ్బాయి, అధ్యక్షుడు గా శివలంక కొండలరావు, ప్రధాన కార్యదర్శి గా మాకిరెడ్డి రామునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.