Mar 19,2023 22:02

లక్ష్మాపురంలో బాణా సంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్న టిడిపి నాయకులు

భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి గెలుపుతో టిడిపి సంబరాలు
ప్రజాశక్తి - పగిడ్యాల

      రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టిడిపి అభ్యర్థులు విజయం సాధించడంతో పగిడ్యాల మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో టిడిపి నాయకులు శనివారం రాత్రి బాణా సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నంద్యాల జిల్లా తెలుగు యువత సభ్యులు మద్దిలేటిగౌడు మాట్లాడారు. పశ్చిమ రాయలసీమ టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి గెలవడం వైసిపి ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసిగి వేసారిపోయారని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం నాలుగేళ్ళ పాలనలో అభివృద్ది చేసింది ఏమీ లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో టిడిపి అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులు వైసిపి ప్రభుత్వనికి తగిన బుద్ది చెప్పారన్నారు. వైసిపి ప్రభుత్వాని ప్రజలు నమ్మేరోజులు పోయాయని, రాబోయో అసెంబ్లీ ఎన్నికలో టిడిపి అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు. టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించిన పట్టభద్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి వార్డు సభ్యులు ఉశేనాలం, టిడిపి నాయకులు షమీన్‌(సిఎం), కుమ్మరి గోవిందు,న రేంద్ర, ఎస్‌.వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.