
ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే
ప్రజాశక్తి - రంపచోడవరం
జగనన్న భుహక్కు భూ రక్ష కార్యక్రమం ద్వారా భూముల రీ సర్వే వేగవంతంగా చేయాలని సంబంధిత అధికారులను రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటిడిఏ సమావేశ మందిరంలో ఏడు మండలాలకు సంబంధించిన గ్రామ సర్వేయర్లకు సర్వేకు సంబంధించిన పరికరాలు, మెడికల్ కిట్లు, రైన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని అన్ని మండలాలలో భూములు రీ సర్వే చేసి రైతులకు హక్కుపత్రాలు పంపిణీ చేసే విధంగా గ్రామ సర్వేయర్లు సుమారు 80 మందికి కిట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ సర్వేకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇన్‌స్పెక్టర్ కె.దేవేంద్రుడు, డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్‌స్పెక్టర్లు రవి శంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.