Dec 02,2021 02:43

జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి మేకపాటి గౌతం రెడ్డి

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో, మద్దిలపాలెం
భవిష్యత్‌ అంతా నైపుణ్యాలదేనని, అంకితభావం, పోరాటపటిమతో నైపుణ్యాన్ని జోడించి ఆగకుండా ప్రయత్నిస్తే జగజ్జేతలుగా నిలుస్తారని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. దక్షిణాది (ఏపి, తెలంగాణ, కేరళ, కర్నాటక, తమిళనాడు) రాష్ట్రాల నైపుణ్య పోటీలు ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీలను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగించారు. ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారుల మార్చ్‌ ఫాస్ట్‌ ద్వారా తానూ స్ఫూర్తి పొందినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంగ్లీష్‌లో కవిత వినిపించారు. ''గట్టిగా ప్రయత్నిస్తే ఆకాశమేమీ హద్దు కాదు.. సముద్రమేమీ పెద్ద లోతూ కాదు.. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా.. కన్నీళ్లే సుడిగండంగా మారినా.. మంచైనా.. చెడైనా వెనుతిరిగి చూడవద్దు.. ఎక్కడా ఆగిపోవద్దు.. మీ ఆలోచన, మీ ఆచరణే మీ హద్దు'' అంటూ మంత్రి మేకపాటి తన ప్రసంగం ద్వారా యువతలో స్ఫూర్తి నింపారు. అంకితభావంతో ఏదైనా చేయండి విజయం మీదేనంటూ యువతను ఉత్సాహపరిచారు. ప్రపంచంలో ప్లిప్‌కార్ట్‌, డెల్‌, జేబిఎం, సిఐఐ వంటి ప్రఖ్యాత సంస్థల ద్వారా పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాన్ని అందించేలా పోటీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. నైపుణ్య పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన 500 మంది యువతీయువకులు భారతదేశాన్ని నడిపించే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. 2022 సంవత్సరంలో చైనాలోని షాంఘై నగరం ప్రపంచ స్థాయి పోటీల్లో ఇక్కడ విజేతలైన వారు పాల్గొనేందుకు అవకాశం ఉందన్నారు.
కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ దేశంలో అత్యధిక మంది యువత ఉన్నారని, ఇదే దేశానికి గొప్ప వరమని తెలిపారు. ఎయు వీసీ ఆచార్య పివిజిడి ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి అత్యుత్తమ నైపుణ్యాలను వెలికితీసే పోటీలు ఏయూలో జరగడం మంచి పరిణామమన్నారు. ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్‌ కొండూరు అజరురెడ్డి మాడ్లాడుతూ ప్రపంచస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొనే లక్ష్యంతో ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరచాలని సూచించారు. నైపుణ్యాభివద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి నైపుణ్య పోటీలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఎస్‌డిసి ఎమ్‌డి బంగారరాజు, వల్డ్‌ స్కిల్స్‌ ఇండియా డైరెక్టర్‌ ప్రకాశ్‌ శర్మ, కల్నల్‌ అరుణ్‌ చందేల్‌ పాల్గొన్నారు.