Apr 18,2021 20:48

కోల్‌కత్తా : భవిష్యత్‌లో దీర్ఘకాలిక పోరాటాలకు యువతే భూమిక కావాలని వామపక్షాలు కాంక్షిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ శాసన ఎన్నికల్లో యువతరానికి విశేష ప్రాధాన్యత కల్పించి వామపక్షాలు వారిపై ఎనలేని భరోసా నిలిపాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న స్థానంలోనూ యువ అభ్యర్థిని బరిలో నిలిపాయంటే వామపక్షాలు యువతకు ఎంతటి ప్రాధాన్యత కల్పించాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో సిపిఎం నేతృత్వంలోని సంయుక్త మోర్చా తరపున అనేక మంది యువ అభ్యర్థులు బరిలో నిలిచారు.
నందిగ్రామ్‌లో తృణమూల్‌ నుంచి మమతా బెనర్జీ, బిజెపి నుంచి సువేంద అధికారి వంటి ధన, కండబలమున్నవారు పోటీ చేస్తుండగా వారిని ఎదుర్కొనేందుకు 33 ఏళ్ల మీనాక్షి ముఖర్జీని సంయుక్త మోర్చా తరుపున సిపిఎం అభ్యర్థిగా బరిలో నిలిపారు. మీనాక్షి అర్భాటం లేని, చిత్తశుద్ధితో కూడిన ప్రచారం నందిగ్రామ్‌ ప్రజానీకాన్ని విశేషంగా ఆకర్షించింది. ఇప్పుడు ఆమె ప్రచార వీడియోలు బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగానూ వైరల్‌గా మారాయి. 2021 ఎన్నికల్లో ఆమె కొత్త తారగా అవతరించారు.
సంయుక్త మోర్చా తరుపున ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న జెఎన్‌యు విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు దీప్షిత ధర్‌ (బాలీ నియోజకవర్గం), జెఎన్‌యుఎస్‌యు ప్రస్తుత అధ్యక్షరాలు ఆశీ ఘోష్‌ (జమురియా నియోజవర్గం), ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య (సింగూర్‌ నియోజకవర్గం), ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రోతికుర్‌ రహ్మాన్‌ (డైమండ్‌ హర్బర్‌ నియోజకవర్గం) వామపక్షాల యువత అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఈ ఎన్నికలను మందబలం, ధన బలం దండిగా ఉన్న తృణమూల్‌, బిజెపి మధ్య జరుగుతున్న రెండు పక్షాల పోటీగా మార్చాలనే ప్రయత్నాలకు గట్టి గండిపడింది. యువ అభ్యర్థులను ఎంపిక చేయడం 'పబ్లిసిటీ స్టంట్‌'గా బిజెపి-తృణమూల్‌ వెళ్లగక్కిన అక్కసుకు ప్రజలే గట్టిగా బదులిస్తుండటం విశేషం. యువ కిశోరాల్లాంటి ఈ అభ్యర్థులకు లభిస్తున్న ఆదరణ అక్కడి ప్రజానీకం ప్రస్తుత నిరాశ పరిస్థితుల మధ్య వామపక్షాల పైపు ఆశగా చూస్తున్నారనడానికి ప్రతీకగా నిలుస్తోంది.
ప్రస్తుత ఎన్నికల్లో టిఎంసి, బిజెపిల నుంచి గట్టిపోటీ ఉన్నా రాష్ట్రంలో సుదీర్ఘ పోరాటాలకు సన్నద్ధం కావడంలో భాగంగానే యువ అభ్యర్థులకు వామపక్షాలు సీట్లు కేటాయించాయి. బిజెపి, టిఎంసి అమలు చేస్తున్న మత ప్రచారం, రెచ్చగొట్టే భావోద్వేగ ప్రచారాలను సమర్థవంతంగా ఎదుర్కొని... నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆకలి వంటి జీవనోపాధికి సంబంధించ్ని ఆర్థిక సమస్యలపై దృష్టి పెట్టడానికి యువ అభ్యర్థులకు ప్రాధాన్యతనిచ్చామని వామపక్షాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్‌ పోరాటాలకు యువతే కదా భూమిక.