Jun 02,2023 22:23

ధర్మవరం మండలం బుడ్డారెడ్డిపల్లిలో అమత్‌ సరోవర్‌ పనులను పరిశీలిస్తున్న సెంట్రల్‌ నోడల్‌ ఆఫీసర్‌ తనూజ ఠాగూర్‌

        ధర్మవరం టౌన్‌ : ఇంకుడు గుంతలు భవిష్యత్తులో రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని జాయింట్‌ కార్యదర్శి, సెంట్రల్‌ నోడల్‌ ఆఫీసర్‌ తనూజ ఠాగూర్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె ధర్మవరం, పుట్టపర్తి మండలాల్లో అమృత్‌ సరోవర్‌ కింద చేపట్టిన పనులను పరిశీలించారు. ధర్మవరం మండల పరిధిలోని బుడ్డారెడ్డిపల్లిలో వాటర్‌ షెడ్‌ పథకం కింద నిర్మాణం చేసిన అమత్‌ సరోవర్‌ పనులు, పుట్టపర్తి మండల పరిధిలోని కంబాలపర్తి చెరువులో జరిగిన పనులను పరిశీలించారు. రైతులు, లబ్ధిదారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంకుడు గుంతల ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతోందని రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఇంకుడు గుంతల ద్వారా పంటలకు నీటిని సులవుగా అందించుకోగలుగుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా తనుజ ఠాగూర్‌ మాట్లాడుతూ ఇంకుడు గుంతలను మరింతగా విస్తరింపజేసి అధికంగా నీటిని నిల్వ చేసుకుంటే వరి పంటను కూడా పండించుకునే అవకాశం ఉందన్నారు. ఇంకుడు గుంతలను రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అరుణ్‌బాబు, రాష్ట్ర జాయింట్‌ కమిషనర్‌ మల్లెల శివప్రసాద్‌, ఈజీఎస్‌ డైరెక్టర్‌ చిన్నతాతయ్య, ఆర్డీవో తిప్పేనాయక్‌, జాయింట్‌ కమిషనర్‌ రూరల్‌ విభాగం శివప్రసాద్‌, డ్వామా పీడీ రామాంజనేయులు, అనంతపురం పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, అసిస్టెంట్‌ పీడీ సుధాకర్‌ రెడ్డి, మండల కార్యదర్శి చంద్రిక, జేఈ నాగేంద్ర, ధర్మవరం ఎంపీడీవో మమతాదేవి, పుట్టపర్తి ఎంపీడీవో అశోక్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.