May 16,2022 23:47

పిల్లర్‌ స్థాయిలో నిలిచిన రైతు భరోసా కేంద్రం

ప్రజాశక్తి-హుకుంపేట:ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ కేంద్రాల పనులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. బిల్లులు చెల్లించక పోవడంతో వీటి నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్లర్లు ముందుకు రాలేదు. దీంతో, ఆయా భవనాల పనులు నిలిచి పోయాయి.
మండలంలోని గన్నేరుపుట్టు గ్రామ పంచాయతీలో 2020 సంవత్సంరలో రైతు భరోసా, సచివాలయం, హెల్త్‌ భవనాలు మంజూరు అయ్యాయి. రెండేళ్లు అవుతున్నా రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి పునాది తవ్వి ఇనుప ఊచలు వేసి నిలిపి వేశారు. గ్రామ సచివాలయం పిల్లర్ల వరకు నిర్మాణం చేపట్టి వదిలేశారు. హెల్‌సెంటర్‌కు పునాదులు తీసేందుకు గోతులు తవ్వి వదిలేశారు. ఈ విధంగా రెండు సంవత్సరాలు అవుతున్నా పనులు మాత్రం ముందుకు సాగ లేదు. 2020 సంవత్సరంలో గ్రామ సచివాలయంకు రూ. 40లక్షలు, రైతు భరోసా కేంద్రానికి రూ.16 లక్షలు, హెల్త్‌ సెంటర్‌కు రూ.16 లక్షలు మంజూరు అయ్యాయి. రెండు సంవత్సరాలు అవుతున్నా నేటికీ పనులు ప్రారంభించక పోవడంతో ఆ భవనాల పనులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. గతంలో ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు సబ్‌కలెక్టర్‌, ఐటిడిపివో లు మండల కేంద్రంలోని పర్యటించి పనులు పూర్తి చేయాలని చెప్పినప్పటికీ కూడా నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో భవనాల నిర్మాణం పూర్తి చేయలేదని పలువురు అంటున్నారు. మండలంలో ముప్పై మూడు పంచాయతీల్లో ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి అయిన భవనం కొట్నాపల్లి రైతు భరోసా మాత్రమే. ఈ భవనాన్ని అధికారులు, పిఒ ప్రారంభించారు.
ఇదే పంచాయతీలోని డొంకినవలసలో గ్రామం లోని పాఠశాల భవనం శ్లాబ్‌ వరకు నిర్మాణం చేపట్టి నిలిపి వేశారు. దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా పనులు పూర్తి చేయలేదు. ఈ భవనం లేక పోవడంతో విద్యార్థులు పెంకుటిల్లులో చదువుతుతున్నారు.