Jan 15,2022 07:32

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సమీపిస్తున్న సమయంలో బిజెపికి బిగ్‌ షాక్‌ తగిలింది. బిజెపి మంత్రులు, ఎం.ఎల్‌.ఎ ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కాషాయాన్ని వీడిన వారిలో కేబినెట్‌ మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య ఒకరు. ఆయన కమలంపై విమర్శనాస్త్రాలు సంధించారు. త్వరలో సమాజ్‌వాది పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. దాంతో యూపీ అధికార యంత్రాంగం నిద్ర లేచింది. 2014లో ఆయన మీదున్న విద్వేషపూరిత ప్రసంగం కేసులో అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఎల్లప్పుడూ అధికారంలో ఉండాలనే కాంక్షతో బిజెపి భయపెట్టే పాలసీని ఎంచుకుంది. ప్రత్యర్థులు, మాట వినని వారిని కేసులతో భయపెట్టాలని చూస్తోంది. ఆర్థికంగా బలహీనపర్చే ప్రణాళికలు అమలు చేస్తోంది.
    ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. సెమీ ఫైనల్‌గా భావించే రాజకీయ పోరుకు తెరలేచింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌లో బిజెపికి కాలం కలిసిరానట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయి పరిస్థితులను చూస్తే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడ అధికారం కోల్పోతామోననే భయం బిజెపిలో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేయడం ఆ భయాన్ని మరింత పెంచింది. దీంతో గతంలో లాగానే మాట వినని వారిపై కేసులు, సీబీఐ, ఈడీ దాడుల్లాంటి వాటికి బిజెపి ప్రణాళికలు వేస్తోంది. ప్రత్యర్థులను భయపెట్టి నోరు మూయించాలని భావిస్తోంది.
 

                                                          ఏడేళ్ల తర్వాత కేసు..

బిజెపి వీడుతున్నట్లు ప్రకటించిన స్వామి ప్రసాద్‌ మౌర్యపై పోలీసులు ఏడేళ్ల క్రితం నమోదు చేసిన కేసులో అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. 2014లో చేసిన విద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించి సుల్తాన్‌ పూర్‌ ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు ఆయనకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. మౌర్య పార్టీని వీడిన ఒక్క రోజులోనే అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. మాట వినని వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించడానికి బిజెపి ఇలా చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
 

                                                             ప్రత్యర్థులపై...

బిజెపి అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థులపై కేసులు బనాయిస్తూ వేధిస్తోంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఇది మరీ ఎక్కువవుతోంది. ఈ సారి కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను వేధించేలా కేసులు, సీబీఐ, ఈడీ దాడులు చేసేలా ప్రణాళికలు రచించిందనే ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులపై ఇళ్లపై దాడులు చేసింది. ఇప్పటికే మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరర, కర్ణాటక ట్రబుల్‌ షూటర్‌ డి.కె శివకుమార్‌, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌ పవార్‌ పై ఈడీ దాడులు నిర్వహించింది. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. హర్యానా మాజీ సి.ఎం భూపేందర్‌ సింగ్‌ హుడాని కూడా ఈడీ వదల్లేదు. కాశ్మీర్‌లో షేక్‌ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, తమిళనాడులో స్టాలిన్‌ అనుచరులు, బంధువుల ఇళ్లలో దాడులు జరిగాయి. యూపీ లో బిజెపి కి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న అఖిలేశ్‌ యాదవ్‌ అనుచరుల మీద ఇటీవల దాడులు చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలో వచ్చాక (2014 నుంచి) రాజకీయ ప్రత్యర్థులు, తమను విమర్శించే వారిపై దర్యాప్తు సంస్థలు 550కి పైగా కేసులు నమోదు చేశాయి. వీరిలో రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, కార్యకర్తలు, లాయర్లు, స్వతంత్ర మీడియా సంస్థలు, జర్నలిస్టులు, సినీ పరిశ్రమకు చెందినవాళ్లు ఉన్నారు. మాట వినని వారిపై రాజద్రోహం కేసులు సైతం నమోదు చేస్తున్నారు. మోడీ ప్రధానిగా ఉన్న ఏడేళ్లలోనే ఏడు వేలకు పైగా రాజద్రోహం కేసులు నమోదయ్యాయి.
 

                                                    విమర్శించేవారే లక్ష్యంగా...

వివిధ దర్యాప్తు సంస్థలు దాడి చేసిన వారిలో అధికంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన 75 మంది, తృణమూల్‌ 36, ఆమ్‌ ఆద్మీ పార్టీ 18 మందిపై దర్యాప్తు సంస్థలు వివిధ కారణాలతో దాడులు నిర్వహించాయి. రాజకీయ నాయకుల మీదే కాదు. విమర్శించిన ఎవరినీ వదిలేది లేదని బీజేపీ స్పష్టంగా చెబుతున్నట్టు పరిస్థితి ఉంది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌, హీరోయిన్‌ తాప్సీ పన్ను, వరవరరావు, సుధా భరద్వాజ్‌, ప్రభుత్వ పని తీరును విశ్లేషిస్తూ, విమర్శిస్తున్న 29 మీడియా సంస్థలపై కూడా కేసులు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పత్రిక 'దైనిక్‌ భాస్కర్‌', టీవీ ఛానల్‌ 'భారత్‌ సమాచార్‌' కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు జరిపాయి.
 

                                                         బిజెపి లో చేరితే..

ఎన్ని కేసులు ఉన్నా బిజెపి లో చేరితే ఆ కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోరన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికే అలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 2014 సమయంలోనే మౌర్యపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఆయన బిజెపి లో వున్నంత కాలం కేసును నానుస్తూ వచ్చారు. అంతేకాకుండా ఎవరైనా బిజెపి లో చేరితే వారి గురించి కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టించుకోవు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి ఉదాహరణలు వందల సంఖ్యలో కనిపిస్తాయి.
    తన పాలన లోని ఘోర వైఫల్యాలను యోగి ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కప్పిపుచ్చుకోలేక పోతున్నది. మరోవైపు విద్వేషాలను రెచ్చగొట్టే బిజెపి రాజకీయాల బండారమూ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. రైతన్నల పోరాటం పెరుగుతున్న ప్రజా చైతన్యానికి సంకేతం. ఈ వాస్తవాలు బిజెపిని భయపెడుతున్నాయి. ఆ భయాన్ని కప్పిపుచ్చు కోవడానికే ప్రత్యర్థులపై రంకెలూ దుష్ప్రచారాలూ కేసులూ. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు.
 

/ వ్యాసకర్త సెల్‌ : 9640466464 /

ఫిరోజ్‌ ఖాన్‌