Aug 09,2022 17:12

వాషింగ్టన్‌ :  దేశీయ సెమీకండెక్టర్లు ( చిప్స్‌) ఉత్పత్తికి సంబంధించిన 280 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతకం చేయనున్నారు. తన ప్రభుత్వ హయాంలో చైనాపై పోటీని మరింత పెంపొందించేందుకు బైడెన్‌ యత్నిస్తున్నారు. మంగళవారం జరగనున్న రోజ్‌గార్డెన్‌ వేడుకలో చట్టసభ సభ్యులు, యూనియన్‌ అధికారులు, స్థానిక రాజకీయ నేతలు, వ్యాపారులు పాల్గంటారని వైట్‌హౌస్‌ తెలిపింది. క్లిష్టమైన, అత్యాధునిక ఉత్పత్తుల కోసం విదేశీ సరఫరా గొలుసుపై అమెరికా ఆధారపడటాన్ని సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా అమెరికన్‌ సెమీ కండెక్టర్ల పరిశ్రమలో పెట్టుబడులను ప్రోత్సహించే కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. చిప్స్‌ పరిశ్రమ కోసం అమెరికాలో పెట్టుబడులను పెడుతున్నామని, 21 శతాబ్దపు ఆర్థిక పోటీలో తాము విజయం సాధించనున్నామని బైడెన్‌ పేర్కొన్నారు. మెమరీ చిప్‌ల దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు మైక్రాన్‌ 40 బిలియన్‌ డాలర్ల ప్రణాళికను ప్రకటిస్తోందని వైట్‌ హౌస్‌ తెలిపింది. న్యూయార్క్‌ చిప్‌ ప్లాంట్‌ను విస్తరించేందుకు క్వాల్‌కామ్‌, గ్లోబల్‌ ఫౌండ్రీస్‌ 4.2 బిలియన్‌ డాలర్లు ప్రకటించాయని పేర్కొంది.