Sep 01,2023 11:31

న్యూఢిల్లీ :   'ఒకే దేశం- ఒకే ఎన్నికలు' ప్రతిపాదనపై కేంద్రం ఓ కమిటిని నియమించినట్లు కీలక వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడినట్లు సమాచారం. సంబంధిత ప్రతిపాదనపై అధ్యయనం నిర్వహించి నివేదిక సమర్పించాల్సిందిగా కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

సెప్టెంబరు 18 నుండి 22 వరకు (ఐదు రోజుల పాటు) పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఈ వార్త వెలువడటం గమనార్హం. ఈ ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం - ఒకే ఎన్నికలు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అంశంపై కేంద్రం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

ఒకే దేశం-ఒకే ఎన్నికలులో భాగంగా దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. మోడీ ప్రభుత్వం పలు మార్లు ఈ అంశం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి మానిఫెస్టోలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రతిపాదన కోసం రాజ్యాంగ సవరణ అవసరమని, లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఐదు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ, మిజోరాంలలో ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌ల మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది మేలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.