Oct 02,2022 17:55

పాట్నా :  బీహార్‌ వ్యవసాయ మంత్రి, ఆర్‌జెడి ఎమ్మెల్యే సుధాకర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా సొంత ప్రభుత్వంపైనే అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.   రాజీనామా విషయాన్ని సుదాకర్‌ సింగ్‌ తండ్రి, ఆర్‌జెడి అధ్యక్షుడు జగధానంద్‌ సింగ్‌  ధృవీకరించారు.  రైతుల సమస్యల గురించి లేవనెత్తుతున్న వ్యవసాయ మంత్రి తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపారని అన్నారు.  అయితే ఈ రాజీనామాపై స్పందించడానికి సుధాకర్‌ సింగ్‌ అందుబాటులో లేరు. 2006లో రద్దు చేసిన అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెటింగ్‌ కమిటీ (ఎపిఎంసి) చట్టాన్ని, మండి విధానాన్ని పునరుద్ధరించేంత వరకు తాను విశ్రాంతి తీసుకోబోనని శనివారం ప్రకటించారు.  ఇది రైతుల వ్యతిరేక నిర్ణయమని అన్నారు. బిజెపి-జెడియు పాలనలో జరిగినట్లే ఇప్పుడూ జరిగితే తాను సహించేది లేదని అన్నారు. మండీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ ప్రకటన చేసిన రెండు రోజుల అనంతరం ఆయన రాజీనామా చేయడం గమనార్హం.