
పాట్నా : బీహార్‌లో జెడి(యు)తో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్‌జెడి సిద్ధమైంది. బిజెపి పొత్తుతో తెగతెంపులు చేసుకున్న నితీష్‌కుమార్ మంగళవారం సాయంత్రం గవర్నర్‌తో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్ కూడా హాజరుకానున్నారు. నూతన ప్రభుత్వానికి సంబంధించి ఇరుపార్టీల మధ్య ఒప్పందం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జెడి(యు), ఆర్‌జెడి కూటమి ప్రభుత్వంలో నితీష్‌కుమార్ ముఖ్యమంత్రిగా, తేజస్వీయాదవ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారు. ఒప్పందం ప్రకారం.. మంత్రిత్వ శాఖలను నితీష్‌కుమార్ కేటాయించనున్నారని, తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రివర్గంలో ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి. స్పీకర్‌ను తేజస్వీయాదవ్ ఎంపిక చేయనున్నారు.
సరికొత్త కూటమికి నేతృత్వం వహించేందుకు సిద్ధమైన నితీష్‌కు శుభాకాంక్షలు అంటూ జెడి(యు) జాతీయ పార్లమెంటరీ బోర్డ్ అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా ట్వీట్ చేశారు. ఆర్‌జెడి నేతలు సైతం ఇలాంటి తీర్మానమే చేశారు. పాట్నాలో సమావేశమైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు తాజా రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. నిర్ణయం తీసుకునే అధికారాన్ని తేజస్వీ యాదవ్‌కు అప్పగించినట్లు సమాచారం. కాంగ్రెస్, వామపక్షాల నేతలు సైతం.. తేజస్వీకి అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రం సహా సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాల్ని లాలూ నిశితంగా గమనిస్తున్నారని.. అయితే రాజకీయ నిర్ణయాలన్నీ పూర్తి స్థాయిలో తేజస్వీనే తీసుకుంటున్నారని ఆర్‌జెడి వర్గాలు తెలిపాయి. నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ విడిపోయిన చోటే మహాగటబంధన్ 2.0 ప్రారంభమవుతుందని ఆర్ జెడి పార్టీ వర్గాలు సూచించాయి. 2015లో జెడి(యు) ఆర్‌జెడి, కాంగ్రెస్ మహాగట్భందన్ నుండి విడిపోయిన సంగతి తెలిసిందే.