Aug 19,2022 08:47

న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానోపై అత్యాచారం చేసిన రేపిస్టులు బ్రాహ్మణులు, సంస్కారం కల్గిన వారని గోద్రా బిజెపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సికె రౌల్జి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానో కేేసులో 11 మంది దోషులను ఇటీవల గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయగా.. విమర్శలు వెల్లువలా వస్తున్న సమయంలో రేపిస్టులకు మద్దతుగా ఎమ్మెల్యే మాట్లాడటం గమనార్హం. దోషులను విడుదల చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించిన గుజరాత్‌ ప్రభుత్వ ప్యానల్‌లో భాగమైన ఇద్దరు బిజెపి నేతల్లో సికె రౌల్జీ ఒకరు. వారు నేరం చేశారో లేదో తనకు తెలియదని, అయితే నేరం చేయాలన్న ఉద్దేశ్యం ఉండాలి కదా అంటూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'రేపిస్టులు బ్రాహ్మిణులు, వారు మంచి సంస్కారాన్ని కలిగి ఉంటారు. వారిని లక్ష్యంగా చేసుకుని, శిక్షించాలనేది ఎవరైనా దురుద్దేశం కావచ్చు' అన్నారు. టిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వై సతీష్‌ రెడ్డి ఈ వీడియోను ట్వీట్‌ చేయగా.. నెట్టింట్లో వైరల్‌గా మారింది. రేపిస్టులు జైలులో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో మహిళా సాధికారత, నారీశక్తి అంటూ మాట్లాడిన కొన్ని గంటల్లోనే వీరు విడుదలయ్యారు. దోషుల విడుదలపై విమర్శలు వస్తున్పప్పటికీ... గుజరాత్‌ ప్రభుత్వం తమ చర్యను సమర్థించుకుంటున్నది.

<


మోడీజీ ఇలాంటి రాజకీయాలు చేయడం సిగ్గుగా అనిపించడం లేదా.. రాహుల్‌
        దోషుల విడుదలపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా విమర్శించారు. 'ఉన్నావ్‌ -బిజెపి ఎమ్మెల్యేను రక్షించే ప్రయత్నం, కథువా - రేపిస్టులకు మద్దతుగా ర్యాలీ, హత్రాస్‌- అత్యాచార నిందితుల పక్షాన ప్రభుత్వం, గుజరాత్‌- అత్యాచార దోషుల విడుదల, సన్మానం. నేరస్థులకు మద్దతు ఇవ్వడం మహిళల పట్ల బిజెపి మనస్తత్వమేమిటో ఈ చర్య ప్రతిబింబిస్తోంది. ఇలాంటి రాజకీయాల చేయడం సిగ్గుగా అనిపించడం లేదా మోడీజీ' అని ఘాటుగా ట్వీట్‌ చేశారు. తృణమూల్‌ ఎంపి మహువా మెయిత్రా కూడా స్పందిస్తూ 'బిల్కిస్‌ బానో మహిళనా లేదా ముస్లిమా అని దేశం నిర్ణయించుకోవడం మంచిది' అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.