
ఇంటర్నెట్‌డెస్క్ : బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రాకు ఎంతటి విశేష ఆదరణ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఆమె మొదటగా తమిళ చిత్రం 'తమిజాన్'తో నటిగా కెరీర్ మొదలుపెట్టి.. అతి తక్కువ కాలంలో హాలీవుడ్ నటిగా ఎదిగింది. బాలీవుడ్లో ఎంతటి విశేష ఆదరణ పొందిందో.. హాలీవుడ్లో కూడా తన ప్రతిభతో రాణిస్తూ.. మంచి గుర్తింపు సంపాదించుకున్నారామె. ఆమె నటనకు గాను జాతీయస్థాయి ఉత్తమ కథా నాయకగానూ పురస్కారమూ వరించింది. ఇక ఆమె నటిగానే కాదు.. నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె బయోపిక్ గురించి ప్రస్తావించగా.. 'దయచేసి నా బయోపిక్ తీయొద్దు. ఎందుకంటే బయోపిక్ తీసే స్థాయికి నేను ఇంకా చేరుకోలేదు... నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది.' అని చెప్పారామె. ప్రస్తుతం ప్రియాంక చేతిలో ''మాట్రిక్స్', 'టెక్ట్స్ ఫర్ యు'తో పాటు పలు హాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి.
ప్రియాంక తన కంటే పదేళ్లు చిన్న వయసున్న నిక్జోనస్ని వివాహమాడిన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్యా వయసురీత్యా తేడాలున్నా.. వారి అన్యోన్యతను చూసినవారెవరైనా సరే.. ముచ్చటపడాల్సిందే. ఇటీవల ప్రియాంక పుట్టినరోజు జరుపుకుంది. అయితే ఈసారి ప్రియాంక పుట్టినరోజునాడు నిక్ తనతో లేడు. నిక్ అమెరికాలో ఉంటే.. ప్రియాంక లండన్‌లో ఉంది. ఈ సందర్భంగా భార్యాభర్తలిద్దరూ ఒకేచోట లేకపోయినా.. నిక్.. ప్రియాంకకు ఖరీదైన వైన్ బాటిల్‌ను సర్ప్రైజ్ గిఫ్ట్‌గా పంపించాడు. భర్త పంపిన బహమతిని ప్రియాంక ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు.
