Sep 22,2022 07:44

కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధి జపం చేస్తూనే వారి ఆయువుపట్టు అయిన అడవిని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. వారి సంస్కృతి సాంప్రదాయాలనూ దెబ్బ తీస్తోంది. సంఘపరివార్‌ శక్తులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. అటవీ ప్రాంతాల్లోని గనులను దేశ విదేశీ కంపెనీలకు అప్పగించడానికి చట్టాలను మార్చేస్తోంది. యుపిఎ ప్రభుత్వానికి వామపక్షాలు వెలుపలి నుంచి మద్దతునిచ్చిన సందర్భంలో వారి ఒత్తిడితో వచ్చిన అటవీ హక్కుల చట్టం (2006) ద్వారా మాత్రమే అడవిపై ఆదివాసులకు, స్థానిక అటవీ నివాసులకు హక్కుల కల్పన జరిగింది. ఆదివాసీల జీవనోపాధిని దెబ్బతీసే విధానాలు అనుసరిస్తూ, వాటికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడకుండా చేసేందుకు చీలికలు సృష్టిస్తున్నారు. ఈ కార్పొరేట్‌ మతతత్వ కూటమి విధానాలను తిప్పికొట్టాలి.


మోడీ ప్రభుత్వం వచ్చాక అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తోంది. హక్కుపత్రాల జారీలో బిజెపి పాలిత రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 22,35,845 హక్కు పత్రాలు జారీ చేశారు. 16,73,843 తిరస్కరించగా 5,36,416 పెండింగ్‌లో పెట్టారు. వీటిలో ఊరుమ్మడి (కమ్యూనిటీ) హక్కుల విషయంలో మరింత దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యక్తిగత దరఖాస్తులు 2,74,078 గానూ 2,10,828 మందికే ఇచ్చారు. 55,192 దరఖాస్తులు తిరస్కరించారు. ఊరుమ్మడివి అయితే 3294 దరఖాస్తుల్లో 1822 మాత్రమే పట్టాలిచ్చారు. అటవీ హక్కు పత్రాల జారీ కోసం మరిన్ని ఉద్యమాలు చేయవలసివస్తోంది. ఇదిలావుండగా అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కొందరు రిటైర్డు అధికారులు వేసిన కేసులో కేంద్ర ప్రభుత్వం తగిన వాదనలు చేయలేదు. సకాలంలో లాయర్లను సైతం పంపని పర్యవసానంగా రిజర్వు ఫారెస్టులోని ఆదివాసులను వెళ్లగొట్టాలంటూ కోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రజా వ్యతిరేకత రావడంతో కేంద్రం పునర్విచారణ కోరడం, కోర్టు బేదఖలుకు గడువు పెంచడం మాత్రమే జరిగాయి తప్ప ఆదివాసుల మెడపై కత్తి పూర్తిగా తొలగిపోలేదు.
మోడీ సర్కారు ఫారెస్టు పాలసీ, ఫారెస్టు చట్టం రూల్స్‌ సవరణలకు పూనుకుంది. అందులో వివిధ అంశాలతోపాటు అటవీ ఉత్పత్తుల వాణిజ్యం, అటవీ ఆధారిత పరిశ్రమలు వంటివి చేర్చారు. ఇప్పటివరకు ఉన్న చట్టాల్లో ఫారెస్టుగా ప్రకటించిన భూమికి యజమాని ప్రభుత్వమే! దాన్ని ప్రజోపయోగ అవసరాలతోసహా దేనికైనా మళ్లించాలంటే రాష్ట్ర స్థాయి అనుమతి పొందాక కేంద్ర ప్రభుత్వ అటవీ పర్యావరణ శాఖనుంచి క్లియరెన్సు కావాలి. కాని అడవిపై కార్పొరేట్ల యాజమాన్యానికి అవకాశం కల్పించాలని మోడీ ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో 'వంద ఎకరాలు లేదా అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో అడవిని మళ్లించాలంటే' అని రూల్స్‌లో ఉండగా 'వెయ్యి హెక్టార్లు (2471 ఎకరాలు) లేదా అంతకన్నా ఎక్కువ' అని సవరిస్తున్నారు. అంటే వేలాది ఎకరాల అడవుల్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలన్నదే సర్కారు యావ. ఇందుకు గ్రామసభల అవసరం కూడా లేకుండా సవరణ ప్రతిపాదించారు. ఇది రాజ్యాంగానికీ పీసా చట్టానికీ వ్యతిరేకం. అటవీ మళ్లింపుపై కేంద్రం ఆమోదిస్తే రాష్ట్రం దాన్ని తప్పక అంగీకరించాల్సిందేనన్నది మరో సవరణ. అంటే ఏదైనా బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ల ఒత్తిడికి లొంగకుండా ఉంటే నేరుగా కేంద్రమే అనుమతి మంజూరు చేసి రాష్ట్రంపై రుద్దుతుందన్నమాట. రాజ్యాంగ ఫెడరల్‌ స్ఫూర్తికి తూట్లు పొడిచి కార్పొరేట్ల సేవలో తరించాలన్నదే కమలం సర్కారు తాపత్రయం. ఇంత దారుణమైన సవరణలు తీసుకొచ్చినా రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కానీ ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి కానీ పల్లెత్తు మాటాడకపోవడం దారుణం.
అడవిని వాణిజ్య, ఆదాయ వనరుగా చూసే పాలసీని తేవాలని మోడీ ప్రభుత్వం పట్టుబడుతోంది. ప్రభుత్వానికి గరిష్ట ఆదాయం సమకూరడం, అడవిని వాణిజ్యీకరించడం అన్న విధానాన్ని బ్రిటిష్‌ పాలకులు 1894లోనే తెచ్చారు. అంటే వలస పాలకులకు నేటి బిజెపి పాలనకు విధానాల్లో తేడా లేదు. అడవిపైన, అటవీ ఉత్పత్తులపైన స్థానిక ప్రజల హక్కుల కోసం, అధికారుల జులుంను వ్యతిరేకిస్తూ అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో మహౌద్యమం సాగింది. మరలా అటువంటి ఉద్యమాలను దేశమంతటా సాగించడమే ఇప్పుడు మన ముందున్న మార్గం.
బి. తులసీదాస్‌