
- కేంద్రం పరిష్కరించే సమస్యల ఊసేలేదు
- మళ్లీ డబుల్ ఇంజిన్ పాట
- సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బిజెపి విజయ సంకల్ప సభ
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : బిజెపికి అధికారంపై ఉన్నంత యావ ప్రజా సమస్యల పరిష్కారంపై ఉండదని మరోసారి తేటతెల్లమైంది. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా రాజకీయ వ్యూహాలపైనే చర్చించారు తప్ప, దేశంలో సమస్యలపై దృష్టి పెట్టలేదు. సమావేశాల ముగింపు రోజు ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బిజెపి నిర్వహించిన విజయ సంకల్ప సభలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అదే పంథాలో మాట్లాడారు. విభజన చట్టం హామీలతోపాటు తెలంగాణకు సంబంధించి కేంద్రం పరిధిలో అపరిష్కృతంగా అనేక అంశాలునాు, ప్రధాని వాటి ఊసే ఎత్తలేదు. ప్రధాని మోడీ వైఫల్యాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ విమర్శలపై కూడా ఆయన స్పందించలేదు. కానీ, తెలంగాణలో బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని అనాురు. తెలంగాణ రైతాంగానికి ఇబ్బందిగా మారిన కేంద్ర ధాన్యం పాలసీ, నదీ జలాల సమస్య, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, రిజర్వేషన్ల సమస్యలను మోడీ ప్రస్తావిస్తారని అనుకున్నా వాటి గురించి ప్రస్తావించలేదు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఆదివారం బిజెపి ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధ్యయనం, ఆవిష్కరణల్లో తెలంగాణ కేంద్రంగా మారిందని తెలిపారు. తెలుగులో సాంకేతిక, వైద్య విద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారమవుతాయన్నారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించిందని తెలిపారు. 'సబ్కా సాథ్. సబ్కా వికాస్' మంత్రంతో తెలంగాణను అభివృద్ధి చేస్తామనాురు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద రామగుండం ఎరువుల పరిశ్రమను పునరుద్ధరించామని, తెలంగాణలో రూ.35 వేల కోట్లతో ఐదు భారీ ప్రాజెక్టులు చేపట్టామని, హైదరాబాద్‌లో పైవంతెనల నిర్మాణానికి రూ.1500 కోట్లు కేటాయించామని తెలిపారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణలో కొత్తగా 3,500 కిలోమీటర్ల జాతీయ రహదారులను అభివృద్ధి చేసినట్లు మోడీ వివరించారు. గత ఎనిమిదేళ్లుగా దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించామన్నారు.
- టిఆర్ఎస్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ చేతుల్లో : అమిత్ షా
టిఆర్ఎస్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసి చేతుల్లో ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. అందువల్లే హైదరాబాద్ విమోచన దినాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించడంలేదన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కెటిఆర్‌ను సిఎంను ఎలా చేయాలనే ఆలోచన తప్ప ప్రజల సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి పెట్టడంలేదని విమర్శించారు. సచివాలయానికి వెళితే అధికారం పోతుందను ఓ మాంత్రికుడి సలహా మేరకే కెసిఆర్ సెక్రటేరియేట్‌కు వెళ్లడం లేదని పేర్కొన్నారు. వచ్చే ఎనిుకల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం బిజెపికే దక్కుతుందన్నారు. అంతకుముందు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగించారు. సభకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి పాలిత ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, బిజెపి నాయకులు హాజరయ్యారు. మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. కాగా, ఈ సభలో ఎస్సి వర్గీకరణ కోసం నినాదాలు చేసిన యువకుడిపై బిజెపి కార్యకర్తలు చేయిచేసుకున్నారు.
- అన్ని రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాల ఏర్పాటుకు కృషి
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ : బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాల ఏర్పాటుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి జాతీయ కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు. కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం ఆయన కీలకోపన్యాసం చేశారు. ఏక్ భారత్... శ్రేష్ఠ్ భారత్, సబ్కా సాత్.. సబ్కా వికాస్ తమ నినాదమని పేర్కొన్నారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకులతో పాటు, జాతీయ నాయకత్వానికి సూచించారు.