Aug 09,2022 21:00

లక్నో :  మహిళపై దాడి, వేధింపుల కేసులో బిజెపి కిసాన్‌ మోర్చాకు చెందిన శ్రీకాంత్‌ త్యాగిని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సినీ పక్కీలో మంగళవారం అరెస్టు చేశారు. నాలుగు రోజులుగా తప్పించుకుతిరుగుతున్న అతడిని మీరట్‌లో అదుపులోకి తీసుకున్నారు. మీరట్‌లో ఒక స్థానికుడు అందించిన సమాచారంతో త్యాగిని అరెస్టు చేశారు. త్యాగి ఆచూకీ కోసం ప్రకటించిన రూ.25 వేల నగదు రివార్డును సమాచారమిచ్చిన స్థానికునికి అందజేస్తామని పోలీసులు తెలిపారు.
 

ఏం జరిగిందంటే..?
నోయిడాలోని గ్రాండ్‌ ఒమాక్సే సొసైటీలో నివాసముండే శ్రీకాంత్‌ త్యాగి.. అదే సొసైటీలో ఉండే ఓ మహిళతో గొడవపడ్డారు. ఆమెపై దుర్భాషలాడుతూ, దాడికి పాల్పడ్డారు. ఆపై త్యాగి మద్దతుదారులు ఆ నివాస ప్రాంగణంలోకి వచ్చి మహిళకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా మరోమారు ఆమెపై దాడి చేశారు. దీనికి సంబంధించిన పలు దృశ్యాలు వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు, అధికారులు సోమవారం త్యాగి ఇంటికి చెందిన అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టారు. ఆయన మద్దతుదారులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే పరారైన త్యాగి మీరట్‌లోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆయన్ను అరెస్టు చేశారు. త్యాగిపై ఇప్పటికే హత్యాయత్నం, దోపిడీ వంటి 9 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనకు  పలు వాహనాలు ఉన్నాయని, అందులో ఓ కారుకు ఎమ్మెల్యేలకు సంబంధించిన అసెంబ్లీ పాస్‌ కూడా ఉన్నట్లు తేలింది. త్యాగి కుంటుంబానికి నోయిడాలో దాదాపు 50 దుకాణాలు ఉన్నాయని, వాటి ద్వారా నెలకు రూ.లక్షల్లో అద్దె వస్తున్నట్లు గుర్తించారు. వీటిల్లో ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.