Oct 28,2021 17:54

టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌ ఆరంభానికి ముందు.. ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి ఇరుజట్ల ఆటగాళ్లు  మద్దతు తెలుపుతూ మోకాలిపై కూర్చున్నారు. కానీ దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. అంతేకాకుండా  జట్టు నుంచే తప్పుకున్నాడు.  దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు(సీఎస్‌ఏ) సైతం మోకాలిపై కూర్చుని ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. దీనిని పాటించకపోవడంపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్‌ఏ చివరి అవకాశం ఇవ్వడంతో తాజాగా అతను దిగొచ్చాడు. జట్టు సభ్యులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా నిలబడడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నానని, తదుపరి మ్యాచ్‌లో మోకాలిపై నిల్చొని ఉద్యమానికి మద్దతు తెలుపుతానని అన్నాడు. ఈ సున్నితమైన అంశాన్ని రాద్దాంతం చేయడం, ఎవరినీ అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. తన చర్యలు ఎవరినైనా బాధించి ఉంటే పెద్ద మనసుతో తనను క్షమించాలని కోరాడు. జట్టుతో చేరేం‍దుకు తాను సుముఖంగా ఉన్నానని తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై ఆటగాళ్లు ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే.