Jan 31,2023 17:27

గాంధీనగర్‌  :   గుజరాత్‌ మోర్బీ బ్రిడ్జి కూలిన కేసులో ప్రధాన నిందితుడు, ఒవెరా గ్రూప్‌ మేనేజిండ్‌ డైరెక్టర్‌ జరుసుఖ్‌ పటేల్‌ మంగళవారం స్థానిక కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో జరుసుఖ్‌ పటేల్‌ను ప్రధాన నిందితుడిగా 1,262 పేజీల చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. దీంతో గతవారం నిందితునిపై అరెస్ట్‌ వారెంజ్‌ కూడా జారీ అయింది. అయితే బ్రిడ్జి ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడని, అరెస్ట్‌ నుండి తప్పించుకునేందుకు బెయిల్‌కోసం కోర్టుని ఆశ్రయించినట్లు పోలీసులు   తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన 10వ నిందితుడు జరుసుఖ్‌ పటేల్‌. గతంలో అరెస్టయిన వారిలో సబ్‌ కాంట్రాక్టర్లు, టికెట్‌ క్లర్కులుగా పనిచేసిన రోజువారీ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.

బ్రిటీష్‌ కాలం నాటి మోర్బీ వంతెన మరమ్మతు, నిర్వహణ కాంట్రాక్టును అజంతా బ్రాండ్‌తో గోడ గడియారాలు తయారీ చేసే కంపెనీ ఒవెరా గ్రూప్‌కు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. పాత కేబుల్స్‌ను మార్చకుండా కేవలం కొద్ది పాటి మరమ్మతుతో ఒవెరా కంపెనీ 2022 అక్టోబర్‌లో బ్రిడ్జీని ప్రారంభించింది. ప్రారంభించిన నాలుగురోజులకే బ్రిడ్జీ. కుప్పకూలగా 135 మంది మరణించారు. ఒవెరా గ్రూప్‌ బ్రిడ్జీకి ఎలాంటి మరమ్మతు నిర్వహించలేదని, తుప్పుపట్టిన కేబుల్స్‌, విరిగిన యాంకర్‌ పిన్‌లు, వదులుగా ఉన్న బోల్టులను అలాగే వదిలివేసిందని ఫోరెన్సిక్‌ పరీక్షలో నిర్థారణైంది.