Aug 18,2022 21:46
  • లూలాకే మొగ్గు

బ్రసీలియా: బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచార ఘట్టానికి తెరలేచింది. ప్రధాన అభ్యర్థులిరువురూ బుధవారం అధికారికంగా తమ ప్రచారాన్ని ప్రారంభించారు. మాజీ అధ్యక్షుడు, వర్కర్స్‌ పార్టీ నేత లూయిజ్‌ ఇనాసియో లూలా (76) డ సిల్వా పారిశ్రామిక కేంద్రమైన సావో బెర్నార్డో డో కాంపోలోని వోక్స్‌వ్యాగన్‌ ప్లాంట్‌ నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించగా, బోల్సనారో (67), జూయిజ్‌ డి పోరా నుంచి ర్యాలీతో ప్రారంభించారు.
లూలా సావోబెర్నార్డోను ఎంచుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. 1970లలో యూనియన్‌ నాయకునిగా ఆయన రాజకీయ జీవితానికి ఇక్కడే అంకురార్పణ జరిగింది.
బోల్సోనారో జూయిజ్‌ డి పోరాను ఎంచుకోవడానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. 2018లో ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన కత్తిపోట్లకు గురైన ప్రదేశమిదే. ఆ కత్తిపోటు ఘటన తరువాత వ్యక్తమైన సానుభూతి ఆయన విజయానికి సోపానంగా ఉపయోగపడింది. ఆనాటి ఘటనను గుర్తు చేస్తూ తాను ఇక్కడే పునర్జన్మ పొందాను, అందువల్లే అధ్యక్షుడిగా దేశానికి సేవలందించే భాగ్యం తనకు లభించిందని ఉద్వేగభరితంగా ఆయన అన్నారు.

వాస్తవంగా ప్రచారం కొన్ని నెలల ముందే ప్రారంభమైంది. అయితే, అధికారికంగా ప్రచారం ప్రారంభించింది ఇప్పుడే. లూలా తన ప్రచారంలో
బోల్సనారోపై తీవ్రంగా ధ్వజమెత్తారు. బోల్సనారో పచ్చి అబద్ధాలకోరు, అమాయక ప్రజలపై మారణకాండ సాగించిన క్రూరుడు అని విమర్శించారు.
ఐపెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా పోల్‌ ప్రకారం లూలా 44 శాతం ఓట్లతో అగ్రగామిగా నిలవగా, బోల్సనారోకు 32 శాతం ఓట్లతో బాగా వెనకబడి ఉన్నారు.. అక్టోబరు 2న జరిగే ఎన్నికల్లో ఏ అభ్యర్థి 50 శాతం కంటే ఎక్కువ చెల్లుబాటు అయ్యే ఓట్లను గెెలుచుకుంటారో వారే విజేతగా నిలుస్తారు. ఒక వేళ ఏ అభ్యర్థికి 50 శాతానికి మించి ఓట్లు రాని పక్షంలో అక్టోబర్‌ 30న రెండో రౌండ్‌ ఎన్నికలు నిర్వహిస్తారు.