టాప్‌ 8 సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.1 లక్షల కోట్లు లబ్ధి..

Feb 25,2024 19:32 #Business

రిలయన్స్‌ దూకుడు ఇలా

గతవారం ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో టాప్‌-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,10,106.83 కోట్లు పెరిగింది. వాటిలో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ భారీగా లబ్ధి పొందింది. గతవారం బీఎస్‌ఈ-30 ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 716.16 పాయింట్లు (0.97 శాతం) పెరిగింది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ), ఐటీసీ, హిందూస్థాన్‌ యూనీ లివర్‌ (హెచ్‌యూఎల్‌) భారీగా లబ్ధి పొందాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌ సంయుక్తంగా రూ.38,477.49 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కోల్పోయాయి.

రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఎం-క్యాప్‌ రూ.43,976.96 కోట్లు పుంజుకుని రూ.20,20,470.88 లక్షల కోట్లకు చేరుకున్నది. శుక్రవారం రిలయన్స్‌ షేర్‌ తాజా 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,996.15లకు దూసుకెళ్లింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.27,012.47 కోట్లు పుంజుకుని రూ.7,44,808.72 కోట్లకు చేరుకుంది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) రూ.7,235.62 కోట్లు పెరిగి రూ. 6,74,655.88 లక్షల కోట్లకు పెరిగింది. ఐటీసీ ఎం-క్యాప్‌ రూ. 8,548.19 కోట్లు పెరిగి రూ.5,13,640.37 కోట్ల వద్ద స్థిర పడింది. హిందూస్థాన్‌ యూనీ లివర్‌ (హెచ్‌యూఎల్‌) మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4,534.71 కోట్లు పెరిగి రూ.5,62,574.38 కోట్ల వద్ద ముగిసింది.

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4,149.94 కోట్లు పెరిగి రూ. 6,77,735.03 కోట్లకు చేరుకున్నది. తద్వారా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ స్థానాన్ని ఎస్బీఐ అధిగమించింది. దీంతో దేశంలోనే టాప్‌-5 కంపెనీల్లో ఒకటిగా ఉందని బీఎస్‌ఈ తెలిపింది. ఇక భారతీ ఎయిర్‌ టెల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.3,855.73 కోట్లు పెరిగి, రూ.6,34,196.63 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ ఎం-క్యాప్‌ రూ.793.21 కోట్లు పెరిగాయి.

మరోవైపు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 27,949.73 కోట్లు తగ్గి రూ.14,66,030.97 కోట్లవద్ద నిలిచింది. ఇన్ఫీ ఎం-క్యాప్‌ రూ.10,527.76 కోట్లు తగ్గి రూ. 6,96,045.32 కోట్లు కోల్పోయింది. గతవారం ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత టాప్‌-10 సంస్థల్లో రిలయన్స్‌ మొదటి స్థానంలో కొనసాగగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్‌, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, ఎస్బీఐ, ఎల్‌ఐసీ, భారతీ ఎయిర్‌ టెల్‌, హిందూస్థాన్‌ యూనీ లివర్‌, ఐటీసీ నిలుస్తాయి.

➡️