రిలయన్స్‌, డిస్నీ మధ్య కుదిరిన ఒప్పందం-రూ.70వేల కోట్ల విలువ

Feb 29,2024 21:34 #Business

న్యూఢిల్లీ : భారత్‌లో తమ మీడియా వ్యాపార కార్యకలాపాలను విలీనం చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండిస్టీస్‌, అమెరికాకు చెందిన వాల్ట్‌ డిస్నీ కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి. విలీన సంస్థ విలువ దాదాపు రూ.70వేల కోట్లు (8.5 బిలియన్‌ డాలర్లు)గా ఉంటుందని అంచనా. విలీన ఒప్పందాలనూ ఇరు సంస్థలు ప్రకటించాయి. కొత్త కంపెనీలో రిలయన్స్‌, దాని అనుబంధ సంస్థలకు 63.16 శాతం మెజారిటీ వాటా ఉంటుంది. డిస్నీకి మిగతా 36.84 శాతం వాటా ఉంటుంది. ఇందులో రెండు స్ట్రీమింగ్‌ సర్వీసులు, 120 టెలివిజన్‌ చానల్స్‌ ప్రసారం కానున్నాయి. వీటి విలీనంతో దేశంలోనే అతిపెద్ద ఒటిటి సంస్థగా ఏర్పాడనుంది. కొత్త సంస్థకు ముకేష్‌ అంబానీ భార్య నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. డిస్నీ మాజీ ఉన్నతోద్యోగి ఉదరు శంకర్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉండాలని ఇరు సంస్థలు అంగీకారానికి వచ్చాయి. కొత్త సంస్థలో రిలయన్స్‌ రూ.11,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

➡️