- క్లౌడ్, కృత్రిమ మేధ సామర్థ్యాలపై దృష్టి : మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదేళ్ల వెల్లడి
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో భారీ పెట్టుబడులను ప్రకటించింది. వచ్చే 2030 నాటికి 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సిఇఒ సత్య నాదేళ్ల వెల్లడించారు. మంగళవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో నాదేళ్ల మాట్లాడుతూ.. దేశంలో క్లౌడ్, కృత్రిమ మేధ సామర్థ్యాలను విస్తరించడం, డేటా సెంటర్ల విస్తరణ కోసం ఈ మొత్తాన్ని వ్యయం చేయనున్నామని తెలిపారు. అదే విధంగా 2030 నాటికి కోటి మందికి కృత్రిమ మేధా (ఎఐ)పై శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇది వరకు ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తం పెట్టుబడులను ప్రకటించలేదని సమాచారం. ఎఐ భవిష్యత్ ఆవిష్కరణలలో కీలకంగా మారనుంది. ఈ క్రమంలోనే భారత్‌లో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సంతోషిస్తున్నామని నాదేళ్ల తెలిపారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ను మరింత విస్తరించనున్నామన్నారు. వచ్చే 2030 నాటికి కోటి మందికి ఎఐలో శిక్షణ ఇవ్వడం ద్వారా.. ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పించనున్నామన్నారు. భవిష్యత్‌లో ఎఐ నిపుణుల అవసరం పెద్ద సంఖ్యలో ఏర్పడుతుందన్నారు. ఎఐలో తమ ఉద్యోగులకు మరింత శిక్షణ ఇవ్వనున్నామన్నారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో భారతీయ నిపుణులు ముందు వరుసలో ఉంటారని ప్రశంసించారు.