అదరగొట్టిన హెచ్‌ఎఎల్‌ క్యూ4 లాభాల్లో 52% వృద్థి

May 16,2024 21:37 #Business, #HAL's Q4 profits
  • 10 శాతం ఎగిసిన షేర్‌

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 52 శాతం వృద్థితో రూ.4,309 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.2,831 కోట్ల లాభాలు నమోదు చేసింది. రక్షణ రంగ, విమానయాన సేవల ఈ సంస్థ రెవెన్యూ రూ.12,495 కోట్లుగా ఉండగా.. గడిచిన మార్చి త్రైమాసికంలో 18 శాతం వృద్థితో రూ.14,769 కోట్లకు చేరింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల రెవెన్యూ 30,381 కోట్లుగా.. నికర లాభాలు రూ.7,621 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం 2022-23లో రూ.26,927 కోట్ల రెవెన్యూతో రూ.5,828 కోట్ల లాభాలను ప్రకటించింది. గురువారం బిఎస్‌ఇలో హెచ్‌ఎఎల్‌ షేర్‌ ఏకంగా 10.03 శాతం పెరిగి రూ.4,603.40కు చేరింది. హెచ్‌ఎఎల్‌కు ఇండియన్‌ ఆర్మీ, నేవి, ఎయిర్‌ ఫోర్స్‌ సహా ఎయిర్‌బస్‌, బోయింగ్‌ కంపెనీలు ప్రధాన క్లయింట్లుగా ఉన్నాయి. గడిచిన త్రైమాసికంలో 135 శాతం వృద్థితో రూ.17,600 కోట్ల ఆర్డర్లను సాధించింది.

➡️