జెఎల్‌ఆర్‌ ఇండియా అమ్మకాల్లో 81% వృద్థి

Apr 11,2024 20:55 #Business, #car

న్యూఢిల్లీ : భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలకు డిమాండ్‌ పెరగింది. టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల కంపనీ జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్‌ (జెఎల్‌ఆర్‌) అమ్మకాలు రికార్డ్‌ స్థాయిలో పెరగడమే ఇందుకు నిదర్శనం. గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24లో జెఎల్‌ఆర్‌ 81 శాతం వృద్థితో 4,436 యూనిట్లను విక్రయించింది. 2009లో భారత మార్కెట్‌లో ప్రవేశించినప్పటి నుంచి ఇదే అత్యంత మెరుగైన అమ్మకాలని పేర్కొంది. అన్నింటింకి మించి గత ఐదేళ్లలో ఈ ఏడాది నమోదు చేసిన వృద్థే అత్యధికమని ఆ కంపెనీ పేర్కొంది. గడిచిన ఏడాదిలో మొత్తం రిటైల్‌ అమ్మకాల్లో రేంజ్‌ రోవర్‌ 160 శాతం, డిఫెండర్‌ 120 శాతం పెరిగాయని జెఎల్‌ఆర్‌ తెలిపింది. ఇక ఈ మధ్యే ప్రారంభమైన 2024 మోడల్‌ డిస్కవరీ స్పోర్ట్‌, రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ ఈ ఏడాదికి 50 శాతం, 55 శాతం చొప్పున వృద్థిని నమోదు చేశాయి. 2024 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో మొత్తం రిటైల్‌ అమ్మకాలు 43 శాతం వృద్థితో 854 యూనిట్లుగా నమోదయ్యాయి. ”గతేడాదిలో జెఎల్‌ఆర్‌ ఇండియా రిటైల్‌ అమ్మకాల్లో రికార్డులను సృష్టించింది. రాబోయే రోజుల్లో మా వ్యూహాలను పెంచుకుని వృద్థిపై మరింత దృష్టి సారిస్తాం. మా ఉత్పత్తి విభాగాల్లో, ముఖ్యంగా రేంజ్‌ రోవర్‌, డిఫెండర్‌ బ్రాండ్‌లలో గత ఏడాది మేము సాధించిన సానుకూల లాభాలు భారతదేశంలో అధిక నాణ్యత గల ప్రీమియం లగ్జరీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నాయి.” అని జెఎల్‌ఆర్‌ ఇండియా ఎండి రాజన్‌ అంబ తెలిపారు.

➡️