రూపాయి డీలా

ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ మరింత పడిపోయింది. బుధవారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు పతనమై 84.44 స్థాయికి దిగజారింది. అమెరికాకు ట్రంప్‌ అధ్యక్షునిగి ఎన్నికైన తర్వాత డాలర్‌ బలపడటానికి తోడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు వరుసగా ఈక్విటీలను తరలించుకుపోవడంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు చమురు ధరలు పెరగడమూ, యుఎస్‌ ఫెడ్‌ మీటింగ్‌ అంశాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు తరలిపోవడంతో ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో రూపాయి విలువ 84.38 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 84.48 కనిష్ట స్థాయిని తాకింది. వరుసగా రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతులు భారం కావడంతో పాటు విదేశీ అప్పులపై అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచనుంది.

➡️