ఆరో రోజూ అమ్మకాల వెల్లువ

Oct 8,2024 00:17 #638 points, #market, #Sensex fell
  • సెన్సెక్స్‌ 638 పాయింట్ల పతనం
  • వీడని యుద్ధ భయాలు

ముంబయి : వరుసగా ఆరో రోజూ దలాల్‌ స్ట్రీట్‌లో అమ్మకాల జోరు కొనసాగింది. సోమవారం ఉదయం ఆశాజనకంగా లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఓ దశలో అమ్మకాలు ముమ్మరంగా సాగడంతో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 962 పాయింట్ల పతనాన్ని చవి చూసింది. తుదకు 638 పాయింట్లు లేదా 0.78 శాతం క్షీణించి 81,050కు పడిపోయిం ది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 218 పాయింట్లు లేదా 0.87 శాతం తగ్గి 24,795 వద్ద నమోదయ్యింది. ప్రధానంగా ఎఫ్‌ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ మధ్య వీడని ఉద్రిక్తతల భయాలు తదితర కారణాలతో మార్కెట్లు నేల చూపులు చూశాయి. ప్రధాన స్టాక్స్‌ అయినా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ షేర్‌ 2.09 శాతం, రిలయన్స్‌ ఇండిస్టీస్‌ షేర్‌ 1.17 శాతం పతనం కావడంతో మార్కెట్లపై మరింత ఒత్తిడి చోటు చేసుకుంది. ఎన్‌టిపిసి, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టి, అదానీ పోర్ట్స్‌ షేర్లు అధికంగా 4 శాతం వరకు విలువ కోల్పోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు ఐటిసి, భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభపడిన వాటిలో ఉన్నాయి. బిఎస్‌ఇలో స్మాల్‌ క్యాప్‌ సూచీ 3.86 శాతం, మిడ్‌ క్యాప్‌ 2.61 శాతం చొప్పున నష్టపోయాయి.

తరలిన రూ.37 వేల కోట్ల ఎఫ్‌ఐఐలు
గడిచిన ఆరు సెషన్లలో భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.37,000 కోట్ల విలువ చేసే ఎఫ్‌ఐఐలను తరలించుకు పోయారు. ఆర్థిక వృద్థి కోసం చైనా కీలక నిర్ణయాలు చేపట్టడమే ఇందుకు ప్రధాన కారనమని నిపుణులు భావిస్తున్నారు. ఇది భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఆరు సెషన్లలో సెన్సెక్స్‌ 4,786 పాయింట్లు క్షీణించింది.

➡️