Indian Stock Market – ట్రంప్‌ ప్రమాణ స్వీకారం వేళ – భారత స్టాక్‌ మార్కెట్‌ లో భారీ కుదుపు

స్టాక్‌ మార్కెట్లు : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ నేడు ప్రమాణస్వీకారం చేయనున్న వేళ … భారత స్టాక్‌ మార్కెట్లు భారీ కుదుపుకు లోనయ్యాయి. ఒక్కసారిగా పెరిగిన స్టాక్‌ మార్కెట్లు … అంతలోనే అమాంతం పడిపోయాయి. ట్రంప్‌ చేసిన ప్రకటనల ప్రభావం స్టాక్‌ మార్కెట్‌ పై కూడా కనిపిస్తోంది. మదుపర్లు ఆచితూచి జాగ్రత్తగా స్పందిస్తున్నారు. మొదట సెన్సెక్స్‌ 125 పాయింట్లకి పైగా లాభంతో దూసుకెళ్లింది. కానీ, ఆ తర్వాత మళ్లీ కిందికి పడిపోయింది. ప్రస్తుతం 9.35 గంటలకు సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 76,635 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మొదట్లో లాభంతో 23,250 మార్క్‌ను తాకినప్పటికీ.. కాసేపటికే నష్టాల్లోకి వెళ్లింది. ప్రస్తుతం 15 పాయింట్ల నష్టంతో 23,186 పాయింట్లతో కొనసాగుతోంది. బ్యాకింగ్‌ షేర్లు లాభాల బాటలో కొనసాగుతుండటం విశేషం. కోటక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌తోపాటు రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లాభాల్లో ఉన్నాయి. శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, టాటా స్టీల్‌, హిందాల్కో ఇండిస్టీస్‌, టాటా మోటార్స్‌ స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారంతో స్టాక్‌ మార్కెట్‌ దిశను నిర్ణయించడంలో విదేశీ పోర్ట్‌ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌ పీఐ) కదలికలు కీలక పాత్ర పోషించనున్నాయి. జనవరి 2025లో ఇప్పటివరకు భారతీయ స్టాక్‌ మార్కెట్ల నుండి విదేశీ పెట్టుబడిదారులు రూ.44,396 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇది కాకుండా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌ వంటి పెద్ద కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌ ట్రెండ్‌లో మార్పును చూడవచ్చు.

➡️