న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు పడిపోయి 83.56 వద్ద ముగిసింది. ఇది మార్చి రెండోవారం నాటి కనిష్ట స్థాయి కావడం గమనార్హం. గడిచిన ఒక్క నెలలోనే దాదాపు 1.7 శాతం వరకు క్షీణించింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. ఉదయం 83.49 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ.. ఇంట్రాడేలో ఏకంగా 83.59 కనిష్ట స్థాయిని తాకింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం ద్వారా దిగుమతుల ఉత్పత్తులు భారం కావడంతో పాటు విదేశీ అప్పులపై వ్యయాలు పెరగనున్నాయి.
