- తక్కువ పన్ను రేట్ల ప్రభావం
- ఐదేళ్లలో బిజెపి సర్కార్ ఉదారత
- టాప్ 10 శాతం కంపెనీలకు బంఫర్ ఆఫర్
న్యూఢిల్లీ : పేద ప్రజల సంక్షేమానికి పైసా వదల్చడానికి, మధ్య తరగతి ప్రజలపై పన్ను రేట్లను తగ్గించడానికి ఒక్కటికి నాలుగు సార్లు ఆలోచించే బిజెపి ప్రభుత్వం.. కార్పొరేట్లకు మాత్రం అడక్కుండానే లక్షల కోట్ల లబ్ధి చేకూర్చింది. తక్కువ పన్ను రేట్లను అమలు చేయడం ద్వారా గడిచిన ఐదేళ్లలో బడాబాబులకు రూ.3.14 లక్షల కోట్లు ఆదా అయ్యింది. మోడీ సర్కార్ రెండో దఫా అధికారంలోకే రాగానే 2019లో కార్పొరేట్లకు భారీగా పన్నులు తగ్గిస్తూ సంస్కరణాలు చేసింది. ది హిందూ కథనం ప్రకారం.. గడిచిన దశాబ్ద కాలంలో కంపెనీలకు మంజూరు చేయబడిన వివిధ ప్రోత్సాహకాలు, తగ్గింపుల ద్వారా వాటి రాబడి అదనంగా రూ.8 లక్షల కోట్లు పెరిగింది. దీంతో ఆ మొత్తం ప్రభుత్వ ఖజానకు గండి పడినట్లయ్యింది. ముఖ్యంగా దేశంలోని అత్యంత ఆదాయాలు కలిగిన టాప్ 10 శాతం కంపెనీలు భారీగా లాభపడ్డాయి. 2018-19తో ముగిసిన ఐదేళ్లలో కంపెనీల లాభాలు నెమ్మదిగా 10.4 శాతం మాత్రమే పెరిగాయి. పన్ను రేట్ల తగ్గింపు తర్వాత అదే ఐదేళ్లలో కంపెనీల లాభాలు 32.5 శాతం పెరగ్గా.. చెల్లించే పన్నుల్లో మాత్రం 18.6 శాతం పెరుగుదల ఉండటం గమనార్హం.
పన్ను సంస్కరణలకు ముందు రూ.400 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ కలిగిన దేశీయ కంపెనీలపై 25 శాతం పన్ను విధించారు. ఇతర కంపెనీలపై 30 శాతం రేటు అమల్లో ఉంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2019లో కార్పొరేట్ పన్ను రేటును 22 శాతానికి తగ్గించింది. మరోవైపు కంపెనీలకు ఆదాయపు పన్ను చట్టం కింద కొన్ని మినహాయింపులను ఇచ్చింది. కొత్తగా స్థాపించబడిన తయారీ సంస్థలకు మరింత తక్కువ పన్నులను కల్పించింది. దీంతో ప్రభుత్వ ఆదాయాలు తగ్గాయి. కార్పొరేట్లపై పన్ను రేట్లను తగ్గించినప్పటికీ ప్రయివేటు రంగ పెట్టుబడులు మాత్రం మిశ్రమంగానే ఉన్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అసోసియేట్ ప్రొఫెసర్ సురంజలి టాండన్ పేర్కొన్నారు. కరోనా కాలం నుంచి ఇప్పటికీ పన్ను ప్రోత్సాహకాలు సమానంగానే ఉన్నాయన్నారు. కార్పొరేట్‌లపై పన్న తగ్గింపునతో ఆ వ్యాపార వర్గాలకు అసమాన ప్రయోజనం చేకూరుతుందని ఐఐటి బాంబే సీనియర్ ఫెలో ఆర్ నాగరాజ్ పేర్కొన్నారు. ఈ తరహా విధానం ప్రపంచంలో ఎక్కడా కూడా మెరుగ్గా పని చేస్తుందనడానికి తమ వద్ద ఆధారాలు లేవన్నారు. ముఖ్యంగా భారత్‌లో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
బిఎస్‌ఇ-500 కంపెనీలను విశ్లేషిస్తే.. ఆర్థిక సంవత్సరం 2018-19 నాటికి కార్పొరేట్ టాక్స్ సగటున 30 శాతంగా ఉంది. మోడీ ప్రభుత్వ నూతన విధానంతో ఇది 2023-24 నాటికి 21.2 శాతానికి తగ్గిపోయింది. దీంతో దేశంలోని టాప్ 10 శాతం కంపెనీలు తక్కువ పన్ను రేట్లతో భారీగా లబ్ధి పొందాయి. 2019 ముందు నాటి పన్ను రేట్లతో పోల్చితే సంస్కరణల తర్వాత రూ.3.14 లక్షల కోట్ల అదనపు ఆదాయం పొందాయని.. దీంతో ఆ మొత్తం రాబడిని ప్రభుత్వాలు కోల్పోయిందని అంచనా.
ఇతర ప్రోత్సాహకాలు అదనం
కార్పొరేట్ సంస్థలు పన్ను రేటు తగ్గింపులతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందుకుంటున్నాయి. ఐటి చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కంపెనీలు పన్ను రాయితీ తగ్గింపులను కూడా పొందుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు, రాజకీయ విరాళాలు, శాస్త్రీయ పరిశోధన, సంస్థలకు విరాళాల కోసం ఆదాయపు పన్ను చట్టం కింద వివిధ మినహాయింపులను పొందాయి. బడ్జెట్ పత్రాల ప్రకారం.. ఈ రాయితీల వల్ల ప్రభుత్వానికి 2012-13 నుంచి 2021-22 మధ్య రావాల్సిన రూ.8.22 లక్షల కోట్ల ఆదాయం గండిపడింది. పన్ను రేట్ల తగ్గింపునతో ప్రయివేటు పెట్టుబడిని ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా పోటీ వాతావరణాన్ని ఎదుర్కొనే ఉద్దేశ్యం అయినప్పటికీ దీని ప్రభావం అసంపూర్తిగానే ఉందని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జికో దాస్‌గుప్తా పేర్కొన్నారు. ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉద్యోగాలను సృష్టించడం, పోటీ వ్యాపార వాతావరణాన్ని నెలకొల్పానే ఉద్దేశ్యంతో సాధారణంగా పన్ను ప్రోత్సాహకాలు ఇస్తారన్నారు. కాగా.. ఇటీవల మోడీ సర్కార్ కొత్త ట్రెండ్‌ను అవలంభిస్తున్న విషయం తెలిసిందే. తనకు అత్యంత కావాల్సిన అదానీ లాంటి పెట్టుబడ ిదారులకు పన్ను తగ్గింపులు, ప్రోత్సాహకాలతో పాటు కారు చౌకగా ప్రభుత్వ ఆస్తులు, సంస్థలను కట్టబెట్టడం, ప్రజలపై అనేక భారాలు మోపి అదానీ ఆదాయాలు పెరిగేలా చేస్తున్న ఘటనలు విపరీతంగా పెరిగినట్లు రిపోర్టులు రావడం మరింత ఆందోళనకర అంశం.