ఎగిసిన వాణిజ్య లోటు

Apr 15,2025 21:23 #Business, #Exports, #Indian Exports
  • మార్చిలో 21.5 బిలియన్లకు చేరిక
  • భారత ఎగుమతులు డీలా

న్యూఢిల్లీ : ప్రపంచ మార్కెట్‌లో భారత ఎగుమతులు డీలా పడటంతో మరోవైపు దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు రికార్డ్‌ స్థాయిలో పెరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాణిజ్యలోటు 14.05 బిలియన్‌ డాలర్లతో మూడు ఏళ్ల కనిష్ట స్థాయి వద్ద నమోదు కాగా.. తిరిగి మార్చిలో ఏకంగా 21.54 బిలియన్లకు ఎగిసింది. ఒక్క సారిగా దిగుమతులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. గడిచిన మార్చిలో భారత సరుకుల దిగుమతులు 11.3 శాతం పెరిగి 64.51 బిలియన్‌ డాలర్లకు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇవి ఫిబ్రవరిలో 50.96 బిలియన్లుగా నమోదయ్యాయి. 2025 మార్చిలో సరుకుల ఎగుమతులు మాత్రం 0.7 శాతం పెరిగి 41.97 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకున్నాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో స్థూల భారత ఎగుమతులు స్వల్పంగా 0.08 శాతం పెరిగి 437.42 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. మరోవైపు దిగుమతులు 6.62 శాతం పెరిగి రూ.720.24 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి. ”గతేడాది సరుకుల ఎగుమతుల్లో పెరుగుదలను సాధించాము. ముఖ్యంగా పెట్రోలియంయేతర ఎగుమతులు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఈ రంగం ఏకంగా 6 శాతం వృద్థిని కనబర్చింది.” అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2024-25లో బంగారం దిగుమతులు 58.01 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇంతక్రితం ఏడాది 45.54 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యియి.

➡️