పేటియంపై చర్యలను వెనక్కి తీసుకోలేం..!

Feb 12,2024 20:55 #Business, #paytm, #RBI
  • వారంలోనే తదుపరి నిర్ణయాలు స్పష్టం చేసిన ఆర్‌బిఐ గవర్నర్‌

ముంబయి : పేటియం పేమెంట్‌ బ్యాంక్‌పై చర్యలు కొనసాగుతాయని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. పేటియంపై ఆర్‌బిఐ నియంత్రణ చర్యల్ని సమీక్షించేది లేదని శనివారం పేర్కొన్నారు. ఫిబ్రవరి 29 నుంచి పేటియం పేమెంట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పిపిబిఎల్‌) డిపాజిట్లు సేకరించకూడదని, రుణాలు జారీ చేయరాదని ఆర్‌బిఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్టాట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సిఎంసి) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు చేయకూడాదని స్పష్టం చేసింది. ఈ దెబ్బతో పేటియం షేర్లు పాతాలానికి పడిపోతున్నాయి. మరోవైపు పేటియం ఖాతాదారులు సగానికి పైగా జారి పోయారు. ఇతర చెల్లింపు వేదికలను ఆశ్రయిస్తున్నారు.

పిపిబిఎల్‌పై ఆంక్షల నేపథ్యంలో శనివారం రిజర్వ్‌ బ్యాంక్‌ సెంట్రల్‌ బోర్డు 606వ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. దీనికి శక్తికాంత దాస్‌ హాజరయ్యారు. భేటీ వివరాలను శక్తికాంత దాస్‌ మీడియాకు వెల్లడించారు. పిన్‌టెక్‌ సంస్థలపై క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆర్‌బిఐ చర్యలకు దిగుతుందని అన్నారు. తమ రెగ్యూలేటరీ సంస్థ ఫిన్‌టెక్‌ సంస్థలకు మద్దతునిస్తూనే.. ఖాతాదారుల ప్రయోజనాలకు కూడా పెద్దపీట వేస్తుందన్నారు. పేటియం విషయంలో తీసుకున్న నిర్ణయాలు, చర్యలను ఎప్పటికప్పుడూ వెల్లడిస్తామని శక్తికాంత తెలిపారు. ఈ వారంలో ఎఫ్‌ఎక్యు (తరుచుగా ఎదురయ్యే ప్రశ్న)లపై వివరణలు జారీ చేస్తామన్నారు. అప్పటి వరకు అందరూ వేచి చూడాలని సూచించారు. పేటియం తీవ్ర నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని.. అనేక సార్లు సమయం ఇచ్చామని ఇది వరకు ఆర్‌బిఐ గవర్నర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. సరిదిద్దుకోవడానికి అవకాశాలు ఇచ్చిన ఉపయోగించుకోలేదన్నారు. పేటియం కెవైసి లేకున్నా అనేక ఖాతాలు ఇచ్చిందని.. ఒకే పాన్‌ కార్డ్‌పై వందలాది ఖాతాలను తెరిచిందని.. మనీలాండరింగ్‌ కూడా జరిగిందని ఆర్‌బిఐ వర్గాలు ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ”రిజర్వ్‌ బ్యాంక్‌ సంస్థలపై చర్యలు తీసుకునే ముందు చేసిన తప్పుల్ని సరిదిద్దుకునేందుకు తగింనంత సమయం ఇస్తుంది. కొన్నిసార్లు ఇది తగినంత సమయం కంటే ఎక్కువగా ఉంటుంది. సంస్థల పట్ల మేం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. ఆర్‌బిఐ ఆదేశాల్ని తప్పకుండా పాటిస్తే ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.” శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.

డైరెక్టర్‌ మంజూ గుడ్‌బై..

పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు స్వతంత్ర డైరెక్టర్‌ మంజూ అగర్వాల్‌ రాజీనామా చేశారు. దీన్ని ఆ సంస్థ దృవీకరించింది. ఇంతక్రితం ఆమె వైదొలిగినట్లు వార్తలు వచ్చాయి. సోమవారం పేటియం సూచీ 0.73 శాతం పతనమై.. రూ.416.80కి పడిపోగా.. గడిచిన నెల రోజుల్లో ఏకంగా 41.64 శాతం లేదా రూ.297 పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు లబోదిబో మంటున్నారు.

➡️