అదానీ అవినీతి ముమ్మాటికి నిజమే

  • ఆ రిపోర్ట్‌కు కట్టుబడి ఉన్నాము..
  • పత్రికల్లో చూసే పరిశోధించాము
  • ఎవరి భయానికో ఏజెన్సీని మూసివేయలేదు
  • హిండెన్‌బర్గ్‌ ఫౌండర్‌ ఆండర్సన్‌ వెల్లడి

న్యూఢిల్లీ : ప్రముఖ బిలియనీర్‌ గౌతం అదానీ అవినీతిపై తాము ఇచ్చిన రిపోర్ట్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని అమెరికన్‌ షార్ట్‌ సెల్లర్‌ రీసెర్చ్‌ ఎజెన్సీ హిండెన్‌బర్గ్‌ ఫౌండర్‌ నథన్‌ అండర్సన్‌ అన్నారు. అదానీ గ్రూపునే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నామనే విషయాన్ని ఆండర్సన్‌ తొలిసారి వెల్లడించారు. అదానీ గ్రూప్‌ తన కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి, షేర్ల ధరలను మార్చడానికి విదేశీ బినామీ, షెల్‌ కంపెనీలను వాడుకుందని.. అదానీ తీవ్ర ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారని గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్‌ సంచలన రిపోర్ట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో ఆ సమయంలో స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూపు కంపెనీల విలువ దాదాపు రూ.12 లక్షల కోట్లు హరించుకుపోయింది.

ఏదైనా చట్టపరమైన లేదా మరేదైనా బెదిరింపు వల్ల ఇటీవల తన సంస్థను మూసివేయాలని నిర్ణయించలేదన్నారు. పని భారం వల్లే మూసివేశామన్నారు. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా ఉన్న నివేదికతో సహా తన అన్ని నివేదికలకు 100 శాతం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కొన్ని మీడియా గ్రూపుల్లో అదానీ అక్రమాలపై వచ్చిన రిపోర్ట్‌ల ఆధారంగా తాము అదానీ గ్రూపునపై పరిశోధన చేపట్టాలని నిర్ణయించామన్నారు. మీడియా కథనాలను నిశితంగా పరిశీలించామని.. సాక్షాలను సంపాదించామన్నారు. దాదాపు 100 పేజీల సాక్ష్యాలను రిపోర్ట్‌లో పొందుపర్చామన్నారు.
హిండెన్‌బర్గ్‌ నివేదిక భారతదేశ ఆర్థిక వృద్ధిపై దాడి అనే వాదనలను ఆండర్సన్‌ కొట్టిపారేశారు.
”మేము ఎల్లప్పుడూ భారతదేశ సామర్థ్యాన్ని విశ్వసిస్తున్నాము. మార్కెట్‌ పారదర్శకత. బలమైన కార్పొరేట్‌ పాలన భారతదేశ వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా చూస్తాము.” అని ఆండర్సన్‌ పేర్కొన్నారు. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ను మూసివేస్తున్నట్లు జనవరిలో ఆండర్సన్‌ ప్రకటించాడు. చట్టపరమైన లేదా వ్యక్తిగత బెదిరింపుల వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. పని భారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. హిండెన్‌బర్గ్‌ను మూసివేసినప్పటికీ అదానీ గ్రూప్‌తో సహా అన్ని సంస్థ నివేదికలు ఖచ్చితమైనవని అండర్సన్‌ సమర్ధించుకున్నారు. అయితే రెగ్యూలేటరీ సంస్థలు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించగా.. తాము పారదర్శకత అవసరమయ్యే సమస్యల గురించి పరిశోధించడం, వ్రాయడం వరకే తమ బాధ్యత అని.. మిగితావి తమ చేతుల్లో ఉండవన్నారు.

➡️