న్యూఢిల్లీ : సింగపూర్‌కు చెందిన విల్మర్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యంగా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ అదానీ విల్మర్ లిమిటెడ్ నుంచి అదానీ గ్రూప్ బయటికి రానుంది. ఈ వంట నూనెల కంపెనీలో ఇరువురికి 43.97 శాతం చొప్పున వాటాలున్నాయి. అదానీ విల్మర్‌లోని తమ పూర్తి వాటాలను విక్రయించనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సోమవారం వెల్లడించింది. అదానీ విల్మర్‌లో తమకు ఉన్న 31.06 శాతం వాటాను విల్మర్ ఇంటర్నేషనల్‌కు విక్రయించడంతో పాటుగా.. మిగతా 13 శాతం వాటాను పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల మేరకు బహిరంగ మార్కెట్‌లో విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ విలువ దాదాపు రూ.16వేల కోట్ల పైగా ఉంటుందని అంచనా. 2025 మార్చి 31 నాటికి ఈ విక్రయ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని అదానీ గ్రూపు తెలిపింది. ఈ భాగస్వామ్యం నుంచి వైదొలుగుతోన్న నేపథ్యంలోని ఆ కంపెనీ బోర్డులో నుంచి తమ డైరెక్టర్లు తప్పుకోనున్నారని పేర్కొంది.
