- ఆయా కంపెనీల పరపతికి కోత
- తాజాగా మూడీస్, ఫిచ్ నిర్ణయం
- ఇప్పటికే ఎస్‌అండ్‌పి కోత
- స్టెబుల్ నుంచి నెగిటివ్ రేటింగ్
- కొత్త అప్పులు పుట్టడం కష్టమే
- షేర్లకు ప్రతికూలమే…!
న్యూఢిల్లీ : గౌతం అదానీకి గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీలు ఒకదాని వెనుక ఒక్కటి భారీ షాక్ ఇస్తున్నాయి. అదానీ లంచాలపై అమెరికన్ కోర్టులో అభియోగాలు నమోదు కావడం, భారత్‌లో తీవ్ర దుమారం రేగడంతో అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు అదానీ గ్రూపు కంపెనీల నిర్వహణ, పనితీరు, ఆర్థిక అంశాలను సమీక్షిస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌అండ్‌పి అదానీ కంపెనీల పరపతికి కోత పెట్టగా.. తాజాగా మంగళవారం మూడీస్, ఫిచ్ ఎజెన్సీలు ఇప్పట్లో అదానీ కోలుకోని నిర్ణయం తీసుకున్నాయి. అదానీ గ్రూపులోని ఏడు కంపెనీల పరపతికి అడ్డంగా కోత పెడుతూ మూడీస్ నిర్ణయం తీసుకుంది. ఇందులో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, రెండు అదానీ ట్రాన్స్‌మిషన్ సంస్థలు, అదానీ ఎలక్ట్రిసిటీ కంపెనీలు ఉన్నాయి. వీటి రేటింగ్‌ను స్థిరత్వం (స్టేబుల్) నుంచి ప్రతికూల స్థాయి (నెగిటివ్)కు తగ్గించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ రేటింగ్‌ను బిఎ1కు తగ్గించింది. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ ఎలక్ట్రిసిటీ, అదానీ పోర్ట్స్‌ల రేటింగ్‌ను బిఎఎ3కి కోత పెట్టింది.
నాలుగు కంపెనీలకు ఫిచ్ ఫంచ్
అదానీ గ్రూపులోని నాలుగు కంపెనీల పరపతికి అమెరికన్ క్రెడిట్ రేటింగ్ కంపెనీ ఫిచ్ కోత పెట్టింది. స్థిరత్వం నుంచి నెగిటివ్ రేటింగ్‌ను ఇచ్చింది. మరో మూడు సంస్థల రేటింగ్‌ను సమీక్షించనుంది. అదానీ ఇంటర్నేషనల్ కంటెయినర్ టర్మినల్ ప్రయివేటు లిమిటెడ్ (ఎఐసిటిపిఎల్), అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రిస్ట్రిక్టెడ్ గ్రూప్1, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రిస్ట్రిక్టెడ్ గ్రూప్2, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌లకు ఇప్పటి వరకు బిబిబి రేటింగ్ ఉండగా.. ప్రతికూల రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. అదే విధంగా అదానీ పోర్ట్స్‌కు బిబిబి మైనస్ పరపతిని కేటాయించింది. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌కు బిబిఫ్లస్‌ని ఇచ్చింది.
మూడీస్, ఫిచ్ కంటే ముందే ఎస్‌అండ్‌పి గ్లోబల్ రేటింగ్స్ కూడా నెగిటివ్ రేటింగ్‌ను ఇచ్చింది. అదానీ ఎలక్ట్రిసిటీ, అదానీ పోర్ట్స్‌కు మూడీస్ ప్రతికూల రేటింగ్‌ను కేటాయించింది. ఈ రెండు కంపెనీల రేటింగ్‌ను బిబిబి మైనస్‌కు తగ్గించినట్లు పేర్కొంది. అదానీ గ్రీన్ ఎనర్జీకి కూడా నెగిటివ్ రేటింగ్‌ను ఇచ్చింది. ఇంతక్రితం వీటికి బిబి ఫ్లస్ రేటింగ్ ఉంది. అదానీ గ్రూపు కంపెనీల డైరెక్టర్ల బోర్డుల్లో సీనియర్ మేనేజ్‌మెంట్ (సిఇఒలతో సహా)లో అదానీ కుటుంబ సభ్యులు ఉండటం వల్ల వారు వ్యాపార వ్యూహం, వృద్థి ప్రణాళికలు, ఆర్థిక విధానాలు, రిపోర్టింగ్, నిర్వహణ అంశాలను గణనీయంగా ప్రభావితం చేయగలరని ఎస్‌అండ్‌పి పేర్కొంది. వివిధ గ్రూప్ కంపెనీలు ట్రెజరీ, ఫైనాన్స్, టెక్నికల్ విభాగాలలో ఒకే రకమైన సమాచారాన్ని పంచుకోవడం ద్వారా సంస్థల నిర్వహణ, పాలనపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని తెలిపింది.
నిధుల సమీకరణకు గడ్డు కాలమే..
ఒక సంస్థకు రేటింగ్ ఎజెన్సీలు ఇచ్చిన పరపతి ఆధారంగానే అంతర్జాతీయ, జాతీయ ఇన్వెస్టర్లు, పెట్టుబడి సంస్థలు నిధులను సమకూర్చుతాయి. గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీలు ఒకదాని వెనుక మరొక్కటి అదానీ గ్రూపు కంపెనీల పరపతికి కోత పెట్టడంతో ఇకపై వాటికి కొత్త నిధులు పుట్టడం గగనమే. ఇప్పటికే అదానీ గ్రూప్ కంపెనీల్లో కొత్తగా ఎటువంటి పెట్టుబడులూ పెట్టబోమని ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎనర్జీస్ ఇఎస్‌ఇ ప్రకటించింది. ఇదే తరహాలో మరిన్ని కంపెనీలు, పెట్టుబడి సంస్థలు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే అదానీ వ్యాపారాల విస్తరణలో స్తబ్దత చోటు చేసుకోనుంది.
అదానీ షేర్ల పతనం..
గ్లోబల్ ఎజెన్సీలు అదానీ కంపెనీల పరపతికి కోత పెట్టడంతో అదానీ సంస్థల షేర్లు మరింత పడిపోనున్నాయి. మూడీస్ దెబ్బకు మంగళవారం అదానీ గ్రూపులోని 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవి చూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 8 శాతం మేర పతనమయ్యాయి. అదానీ పోర్ట్స్ 4 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 4 శాతం, అదానీ విల్మర్ 3 శాతం, అంబూజా సిమెంట్ 2.75 శాతం, ఎసిసి, ఎన్‌డిటివి షేర్లు ఒక్క శాతం పైగా నష్టపోయాయి. ఇంతక్రితం రెండు సెషన్లలో మాత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్‌డిఎ గెలుపొందడంతో అదానీ షేర్లకు మద్దతు లభించింది. మూడీస్, ఫిచ్, ఎస్‌అండ్‌పి ఎజెన్సీల రేటింగ్ కోత వచ్చే మార్కెట్ సెషన్లలో అదానీ కంపెనీల షేర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉందని.. రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.