అదానీలు నోరు తెరిస్తే అబద్ధాలే !

Nov 27,2024 04:19 #Adani, #Business
  • స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తప్పుడు సమాచారం
  • మాయమాటలతో ఇన్వెస్టర్లను వంచించిన వైనం

న్యూఢిల్లీ : సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను దక్కించుకునేందుకు అదానీ సంస్థ కానీ లేదా ప్రమోటర్‌ గౌతమ్‌ అదానీ సహా ఆ గ్రూపుతో సంబంధమున్న వ్యక్తులు కానీ భారతీయ అధికారులకు ముడుపులు అందజేశారా? లేదా? అనే విషయంపై అమెరికాలో దర్యాప్తు అధికారులు పరిశీలన జరుపుతున్నారని ఈ ఏడాది మార్చి 15న బ్లూమ్‌బర్గ్‌ అనే మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఇందులో నిజం లేదని రెండు రోజుల తర్వాత అదానీ గ్రూప్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ విభాగం అధిపతి వివిధ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సంస్థలు, పెట్టుబడిదారులకు పంపిన ఇ–మెయిల్‌ ద్వారా తెలియజేశారు. అదంతా తప్పుడు కథనమని గౌతమ్‌ అదానీ మేనల్లుడు సాగర్‌ ఆర్‌ అదానీ కూడా ఆరోపించారు. మరో రెండు రోజుల తర్వాత భారత స్టాక్‌ ఎక్స్చేంజీలకు అదానీ గ్రూప్‌ ఓ సమాచారం పంపుతూ విచారణ గురించి తనకేమీ తెలియదని బొంకింది. అయితే ఈ వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఇటీవలి పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో టాప్‌ 5లో చేరిన అదానీ ఆది నుంచి ప్రతి వ్యవహారంలోనూ అబద్ధాలతోనే వంచిస్తూ కేంద్రంలోని పెద్దల సహకారంతో తన వ్యాపార సామాజ్య్రాన్ని నిర్మించుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారని వాణిజ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భిన్న వాదనలు

భారత్‌లో సౌర విద్యుత్‌ కాంట్రాక్టులు పొందేందుకు గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్‌లోని సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు అనేక మిలియన్‌ డాలర్ల ముడుపుల కుంభకోణానికి పాల్పడ్డారని, అమెరికాలోని పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేందుకు వారు దీనిని వాడుకున్నారని ఆరోపిస్తూ అమెరికా ప్రాసిక్యూటర్లు న్యూయార్క్‌ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సాగర్‌ అదానీపై సంవత్సరం క్రితమే విచారణ ప్రారంభించామని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్స్‌ (ఎఫ్‌బిఐ) బయటపెట్టింది. విచారణ సంగతే తమకు తెలియదని మన స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అదానీలు చెప్పిన మాటలకు ఎఫ్‌బీఐ ప్రకటన పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఏడాది మార్చి 4న జారీ చేసిన బాండ్‌ ఆఫర్‌ డాక్యుమెంట్‌కు సంబంధించి అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు జరుపుతోందని అదానీ గ్రీన్‌ ఎనర్జీ అనుబంధ సంస్థలు సూచనప్రాయంగా చెప్పాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే విచారణ విషయం తనకు తెలియదని అదానీలు పచ్చి అబద్ధాలు ఆడారు.

2003లోనే సాగర్‌ అదానీకి సెర్చ్‌ వారంట్‌

బ్లూమ్‌బర్గ్‌లో కథనం ప్రచురితమైన తర్వాత మార్చి 19న అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఎజిఇఎల్‌్‌) బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీకి, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీకి ఇమెయిల్స్‌ పంపింది. ‘బ్లూమ్‌బర్గ్‌లో ప్రచురితమైన ఆరోపణలకు సంబంధించి అమెరికా న్యాయ శాఖ నుండి మాకు ఎలాంటి నోటీసులు రాలేదు’ అని వాటిలో తెలిపింది. అమెరికా అవినీతి నిరోధక చట్టాలను ‘థర్డ్‌ పార్టీ’ ఉల్లంఘిస్తోందన్న విషయంపై విచారణ జరుగుతోందని మాత్రమే తనకు తెలుసునని చెప్పింది. అయితే గత ఏడాది మార్చి 17న ఎఫ్‌బీఐ ఏజెంట్లు అమెరికాలో సాగర్‌ అదానీని కలిసి సెర్చ్‌ వారంట్‌ అందజేశారు. సాగర్‌ అదానీకి చెందిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ మరునాడే సాగర్‌ అదానీపై జారీ చేసిన సెర్చ్‌ వారంట్‌ను, విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుపుతూ అందించిన నోటీసును గౌతమ్‌ అదానీ తనకు ఇమెయిల్‌ ద్వారా పంపుకున్నారు.

దావాల్లోనే స్పష్టం చేశారు

విచారణ విషయం తెలిసినప్పటికీ గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీలు ముడుపుల వ్యవహారాన్ని అమెరికాలోని ఆర్థిక సంస్థలు, పెట్టుబడిదారులకు తెలియజేయలేదని, అంతేకాక తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని అమెరికా ప్రాసిక్యూటర్లు తమ ఛార్జిషీటులో ఆరోపించారు. విచారణలో భాగంగా అమెరికా సెక్యూరిటీలు-ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ అదానీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ల పైన, అజూర్‌ పవర్‌ ఇన్వెస్టర్‌కు చెందిన ఎగ్జిక్యుటివ్‌ పైన రెండు దావాలు వేసింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ కీలక ఎగ్జిక్యూటివ్‌లు గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీ, వినీత్‌ అదానీపై విచారణ జరుగుతోందని వాటిలో స్పష్టంగా తెలియజేశారు.

అంతా పారదర్శకమేనట

తనపై విచారణ జరుగుతున్న విషయం తెలియనే తెలియదని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు చెప్పిన నెలలోనే బాండ్‌ ఆఫర్‌ డాక్యుమెంట్‌కు సంబంధించి తనపై ముడుపుల వ్యతిరేక దర్యాప్తులు సాగుతున్నాయని అదానీ గ్రీన్‌ ఎనర్జీ అంగీకరించింది. పునరుద్పాదక ఇంధన కాంట్రాక్టులను పారదర్శకంగా, భారత్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన పోటీ టెండర్‌ ప్రక్రియలోనే పొందానంటూ అదానీ గ్రీన్‌ తన ఇన్వెస్టర్లను నమ్మించింది. ఈ విధంగా ఇన్వెస్టర్లను మోసం చేయడం, తప్పుదోవ పట్టించడం సెబీ నిబంధనలకు వ్యతిరేకం. కాగా భారతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అదానీ గ్రూపుపై సెబీ విచారణ జరిపే అవకాశం ఉన్నదని సమాచారం.

➡️