అదాని కేసును పున:సమీక్షించాలి

Feb 14,2024 11:04 #Business

సిట్‌ దర్యాప్తునపై ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటీషన్‌

సుప్రీంకోర్టును కోరిన అనామికా జైస్వాల్‌

ముంబయి : అదాని- హిండెన్‌ బర్గ్‌ కేసును పున:సమీక్షించాలనే డిమాండ్‌ వచ్చింది. ఈ కేసులో సిట్‌ దర్యాప్తును నిరాకరిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన తీర్పును సమీక్షించాలని మంగళవారం పిటిషన్‌ దాఖలయ్యింది. అసలు కేసులో పిటిషనర్లలో ఒకరైన అనామికా జైస్వాల్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జనవరి 3న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరారు. ఈ కేసులో సుప్రీం ఇచ్చిన 46 పేజీల తీర్పులో సెబి నుండి దర్యాప్తును సిట్‌కు బదిలీ చేయడానికి ఎటువంటి కారణం లేదని పేర్కొంది. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్‌ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి కోర్టులో పిటిషన్లు దాఖలు కాగా సుప్రీం తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే.అదాని కంపెనీల ఆర్థిక అవకతవకలపై హిండెన్‌బర్గ్‌, ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఒసిసిఆర్‌పి) చేసిన ఆరోపణలపై సెబీ చేసిన దర్యాప్తును తప్పుపట్టలేమని తెలిపింది. ఈ కేసు విచారణను సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న రెండు కేసులపై దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని సెబీకి సూచించింది. కాగా.. దీనిపై తాజాగా జైశ్వల్‌ రివ్యూ పిటీషన్‌ వేశారు. సీట్‌ దర్యాప్తును సుప్రీంకోర్టు తిరస్కరించడంలో స్పష్టమైన లోపాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి వైఫల్యాలు చివరకు చట్టబద్దమైన ఉల్లంఘనలకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఎస్‌సిఆర్‌ఆర్‌ 1957లోని రూల్‌ 19ఎను అదాని గ్రూపు కంపెనీలు స్పష్టంగా ఉల్లఘించాయని పిటీషనర్‌ పేర్కొన్నారు. అదాని గ్రూపుల్లో డొల్ల కంపెనీల పెట్టుబడులపై ఇది వరకు డిఆర్‌ఐ చేసిన విచారణను గుర్తు చేశారు. పెండింగ్‌లో ఉన్న రెండు దర్యాప్తులను గడువులోగా పూర్తి చేయడానికి సెబికి గడువు విధించాలని సుప్రీంకోర్టును పిటిషనర్‌ కోరారు.

➡️