Adar Poonawalla : వారానికి 90గంటల పని ఆచరణ సాధ్యం కాదు

ముంబై : ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని ఇటీవల ఎల్‌అండ్‌టి ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యానించారు. గతంలో ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నారాయణ మూర్తి కూడా వారానికి 70 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తీవ్రంగా విమర్శించాయి. ఈ నేపథ్యంలో వర్క్‌ – లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేసుకోవడానికి రోజుకు 8-9 గంటలు పనిచేస్తే చాలని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సిఇఓ అదర్‌ పూనేవాలా చెప్పారు. తాజాగా ఆయన ప్రముఖ మీడియా ఛానెల్‌ బిజినెస్‌ ఇండియాతో మాట్లాడుతూ… ‘మానవులు ఉత్పాదకతలో 8-9 గంటలే పనిచేయగలరు. కొన్నిసార్లు అంతకుమించి పని చేయవచ్చు. అంతవరకు బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు అదనంగా కొన్నిగంటలు పనిచేసినా ఇబ్బంది ఉండదు. కానీ ప్రతిరోజూ… మండే టు సండే ఆఫీసులో అలా పనిచేయలేరు. అది ఆచరణ సాధ్యం కానిది’ అని అన్నారు. అలాగే పనిగంటలపై ఇటీవల వ్యాఖ్యానించిన సుబ్రహ్మణ్యన్‌, నారాయణమూర్తిలు కూడా 365 రోజులూ పని చేసి ఉండకపోవచ్చు అని పూనేవాలా అన్నారు. అయితే ఉద్యోగులందరూ కష్టపడి పనిచేయాలన్నదే వారి ఉద్దేశం అయివుండొచ్చునని పూనెవాలా చెప్పారు.

 

➡️