- ఖండించలేని స్థితిలో అధ్యక్షుడు
- యుఎస్ స్టాక్ మార్కెట్లు కుదేలు
- రూ.350 లక్షల కోట్ల సంపద ఆవిరి
- ట్రంప్ ఆర్థిక అనిశ్చితి విధానాల ఎఫెక్ట్
- స్తబ్దుగా భారత మార్కెట్లు
వాషింగ్టన్ : అమెరికా ఆర్ధిక వ్యవస్థ మాంద్యం సుడిగుండంలో చిక్కుకుంటోంది. ఎవరు తీసిన గోతిలో వారే పడ్డట్లుగా ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఆ దేశానికే ముప్పు తెచ్చిపెడుతోంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనిశ్చితి ఆర్ధిక విధానాలతో అక్కడి స్టాక్ మార్కెట్లు కుదేలు కావడమే ఇందుకు నిదర్శనం. లక్షల కోట్ల డాలర్ల మదుపరుల సంపద నిలువునా ఆవిరైపోతోంది. ట్రంప్ వాణిజ్య యుద్ధ నిర్ణయాలతో 20 రోజుల్లోనే అమెరికా స్టాక్ మార్కెట్లు నాలుగు ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.350 లక్షల కోట్లు) మేర నష్టపోయాయి. ఇది బ్రిటన్, ఫ్రాన్స్ జిడిపిల కంటే ఎక్కువేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 19న నాటి ఆల్‌టైం గరిష్టాల నుంచి మార్కెట్లు 8 శాతానికి పైగా పతనమయ్యాయి. ట్రంప్ అనాలోచిత నిర్ణయాల కారణంగా సోమవారం అక్కడి మార్కెట్లు భారీ పతనాన్ని చవి చూశాయి. నాస్‌డాక్ సూచీ నాలుగు శాతం, ఎస్ అండ్ పి -500 సూచీ 2.7 శాతం నష్టపోయాయి. ఒక దశలో 3.6 శాతం నష్టపోయిన ఎస్ అండ్ పి-500 సూచీ ఆ తర్వాత కొద్దిగా తేరుకుంది. ఈ ఒక్క సెషన్‌లోనే టెక్ సూచీలు భారీగా కుప్పకూలాయి. ఆపిల్ కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ ఏకంగా 174 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.15 లక్షల కోట్లు) పతనమయ్యింది. ఆపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఎన్విడియా, అల్పాబెట్, అమెజాన్, మెటా కంపెనీలకు చెందిన 750 బిలియన్ డాలర్ల (రూ.65 లక్షల కోట్లు) సంపద హరించుకుపోయింది. 2022 తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్‌లో ఇదే అత్యంత దారుణమైన రోజని నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుపోతోందని, వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొంటోందని ఆందోళననలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ అనేక ట్రిలియన్ డాలర్లు నష్టపోతోంది. ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలతో పెట్టుబడిదారులు బెంబేలెత్తుతున్నారు. కేవలం షేర్ల విలువ మాత్రమే కాదు…కార్పొరేట్ బాండ్లు, అమెరికా డాలర్, క్రిప్టో కరెన్సీలు కూడా భారీగా నష్టపోతున్నాయి. మాంద్యం రిపోర్టులతో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయన్న వార్తలతో మంగళవారం భారత మార్కెట్లు స్తబ్దుగా ట్రేడింగ్ అయ్యాయి. సెన్సెక్స్ 12.85 పాయింట్ల నష్టంతో 74,102 వద్ద ముగియగా.. నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 22,498 వద్ద ముగిసింది.
ట్రంప్ దాటవేత..!
ట్రంప్ వాణిజ్య విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎంత దారుణమైన ప్రభావం చూపుతున్నాయో ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తోన్నాయి. వాణిజ్య యుద్ధం అమెరికాను మాంద్యంలోకి నెడుతుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ట్రంప్ కూడా ఏమీ చెప్పకుండా దాటవేత వైఖరీని అవలంబిస్తున్నారు.. అమెరికా మాంద్యం దిశగా వెళుతోందా అని ఫాక్స్ న్యూస్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాటవేశారు. ‘అలా అంచనాలు వేయడాన్ని నేను ఇష్టపడను. ఇది పరివర్తన దశ. మేము చాలా పెద్ద పని పెట్టుకున్నాము. సంపదను తిరిగి అమెరికాకు తీసుకువస్తున్నాము. అందుకు సమయం పడుతుంది’ అని చెప్పుకొచ్చారే తప్పా మాంద్యం అవకాశాలను తోసిపుచ్చలేదు. గోల్డ్‌మన్ శాక్స్ కూడా అమెరికాలో వచ్చే 12 నెలల్లో ఆర్థిక మాంద్యం వచ్చేందుకు 15-20శాతం అవకాశాలున్నాయని అంచనా వేసింది.
వాణిజ్య విధానమే తప్పు..!
అమెరికా మార్కెట్ల పతనానికి అనేక కారణాలు కన్పిస్తున్నప్పటికీ వాణిజ్య విధానంలో ట్రంప్ తెచ్చిన మార్పులు, ఆర్థిక మాంద్యం భయాలు ప్రధాన కారణాలని లాజర్డ్ సిఇఒ పీటర్ ఓర్స్‌జాగ్ అభిప్రాయపడ్డారు. అమెరికాకు ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలైన కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్ ఇప్పుడు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటున్నాయని ఆయన చెప్పారు. మార్కెట్లలో అనిశ్చితి కారణంగా మదుపరులు సురక్షితమైన ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అమెరికాలో రాబోయే సంవత్సర కాలంలో మాంద్యం ఏర్పడేందుకు 15-20 శాతం అవకాశాలు ఉన్నాయని గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ అంచనా వేసింది. గతంలో వేసిన వృద్ధి రేటు అంచనా 2.2 శాతాన్ని ఆ సంస్థ 1.7 శాతానికి కోత పెట్టింది. ఇంత జరుగుతున్నా ట్రంప్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని వీడడం లేదు. సుంకాలకు సంబంధించి తాను అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఎంత చేటు తెస్తున్నాయో ఆయన అర్థం చేసుకోకపోవడం గమనార్హం.
హామీలేవీ ఇవ్వలేదు : భారత్
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తానని తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని భారత్ తాజాగా స్పష్టం చేసింది. సుంకాలను తగ్గించేందుకు భారత్ అంగీకరించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై కేంద్రం స్పందించింది. అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని ఓ పార్లమెంటరీ కమిటీకి తెలియజేసింది. ‘సమస్య పరిష్కారానికి సెప్టెంబర్ వరకూ గడువు కావాలని మాత్రమే అడిగాము’ అని వివరించింది. రెండు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం దిశగా కృషి చేస్తున్నాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్త్వాల్ తెలిపారు. తక్షణం సుంకాల సర్దుబాటు కుదుర్చుకునే కంటే దీర్ఘకాల వాణిజ్య సహకారంపై దృష్టి సారిస్తున్నామని ఆయన చెప్పారు.