అమరావతి : ఇండియన్ రైల్వే సరికొత్త ప్రయోగం చేపట్టింది. ఇకపై కదిలే రైళ్లల్లో కూడా ఎటిఎం సర్వీసును సెంట్రల్ రైల్వే ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఎటిఎం సర్వీసును ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్‌ను అధికారులు పరిశీలించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశ వ్యాప్తంగా అన్ని రైళ్లలో ఎటిఎం సర్వీసులు రానున్నాయి. రైల్వే అధికారులు మాట్లాడుతూ … మొదటిసారిగా ముంబయిమన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లో ఏర్పాటు చేశామన్నారు. త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని ప్రయాణీకులందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని, సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫిసర్ స్వప్నిల్ నీలా తెలిపారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినియోగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్ డోర్ అమర్చారనీ, దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు. అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్‌ప్రెస్ వెళుతుంది. దాదాపు 4 గంటల 30 నిముషాల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
